Share News

తాండవకు నిధుల వరద

ABN , Publish Date - May 27 , 2025 | 01:55 AM

తాండవ రిజర్వాయర్‌ కాలువలకు సంబంధించి అక్విడక్టులు, అండర్‌ టన్నెళ్లు, సూపర్‌పాసేజ్‌లు, ఇతర మరమ్మతు పనులకు ప్రభుత్వం రూ.4.2 కోట్లు మంజూరు చేసిందని తాండవ ప్రాజెక్టు డీఈఈ అనురాధ తెలిపారు.

తాండవకు నిధుల వరద

57 మరమ్మతు పనులకు రూ.4.2 కోట్లు మంజూరు

అక్విడక్టులు, అండర్‌ టన్నెళ్లు, సూపర్‌ పాసేజ్‌లకు మరమ్మతులు

ప్రాజెక్టు డీఈఈ అనురాధ వెల్లడి

నీటి సంఘాల ఆధ్వరంలో పనులు

ఖరీఫ్‌కు నీటి విడుదల చేసేనాటికి పూర్తి

నాతవరం, మే 26 (ఆంధ్రజ్యోతి):

తాండవ రిజర్వాయర్‌ కాలువలకు సంబంధించి అక్విడక్టులు, అండర్‌ టన్నెళ్లు, సూపర్‌పాసేజ్‌లు, ఇతర మరమ్మతు పనులకు ప్రభుత్వం రూ.4.2 కోట్లు మంజూరు చేసిందని తాండవ ప్రాజెక్టు డీఈఈ అనురాధ తెలిపారు. సోమవారం ఇక్కడ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ కరక సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన నీటి సంఘాల అధ్యక్షుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఎనిమిది అక్విడక్టులు, ఏడు అండర్‌ టన్నెళ్లు, పదికిపైగా సూపర్‌ పాసేజ్‌లతో కలిపి మొత్తం 57 పనులకు నిధులు మంజూరయ్యాయని, నీటి సంఘాల ఆధ్వర్యంలో వెంటనే పనులు ప్రారంభించి ఖరీఫ్‌కు నీటిని విడుదల చేసే సమయానికల్లా పూర్తిచేయాలని చెప్పారు. కాగా మైనర్‌ కాలువకు పలుచోట్ల తలుపులు పాడై నీరు వృథాగా పోతున్నదని, అందువల్ల తలుపులు ఏర్పాటు చేయించాలని పలు నీటి సంఘాల అధ్యక్షులు కోరారు. ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ సత్యనారాయణ మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి హామీ పథకం నిధులు రూ.1.5 కోట్లతో కాలువల్లో పూడిక తీయిస్తున్నామని, మెయిన్‌ గేట్ల మరమ్మతు పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇంకా పలు కట్టడాల మరమ్మతు పనులకు నిధులు మంజూరు చేయాలని మంత్రి రామానాయుడుని, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుని కోరడంతో తాజాగా రూ.4.2 కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు కమిటీ వైస్‌ చైర్మన్‌ జోగిబాబు, నాయకులు నందిపల్లి వెంకటరమణ, పారుపల్లి కొండబాబు ఎన్‌.విజయ్‌కుమార్‌, సింగంపల్లి సన్యాసిదేముడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 01:55 AM