సబ్సిడీ రుణాలకు దరఖాస్తుల వెల్లువ
ABN , Publish Date - May 13 , 2025 | 01:15 AM
కూటమి ప్రభుత్వం సంక్షేమ శాఖలకు భారీగా నిధులు మంజూరుచేస్తోంది.

ఎస్సీ నిరుద్యోగ యువత కోసం జిల్లాకు 406 యూనిట్లు, రూ.16.88 కోట్లు మంజూరు
కనిష్ఠంగా రూ.లక్ష నుంచి గరిష్ఠంగా రూ.4 లక్షల వరకూ ఇప్పటికే 8,945 దరఖాస్తులు రాక
జాబితాలో 32 కేటగిరీలకు చెందిన వ్యాపారాలు
విశాఖపట్నం, మే 12 (ఆంధ్రజ్యోతి):
కూటమి ప్రభుత్వం సంక్షేమ శాఖలకు భారీగా నిధులు మంజూరుచేస్తోంది. సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలను అందించి, నిరుద్యోగ యువత ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇప్పటికే బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వందలాది మందికి సబ్సిడీతో కూడిన రుణాలు ప్రభుత్వం మంజూరుచేసింది. ఈ క్రమంలోనే ఎస్సీ నిరుద్యోగ యువతకు సబ్సిడీతో కూడిన రుణాలు అందించేందుకు దరఖాస్తులను స్వీకరించింది.
జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను ఎస్సీ నిరుద్యోగ యువతకు సబ్సిడీతో కూడిన రుణాలు అందించేందుకు 406 యూనిట్లు మంజూరుచేసింది. ఇందుకు రూ.16.88 కోట్ల వ్యయం అవు తుందని అంచనా వేసింది. ఈ మొత్తంలో రూ.6.68 కోట్లు సబ్సిడీ కాగా, రూ.9.35 కోట్లు బ్యాంకుల ద్వారా రుణంగా అందించ నున్నారు. లబ్ధిదారుల వాటా రూ.0.84 కోట్లుగా నిర్ణయించారు. కనిష్ఠంగా లక్ష రూపాయల నుంచి గరిష్ఠంగా నాలుగు లక్షల వరకూ రుణాలను పొందేందుకు అవకాశం ఉంది.
406 యూనిట్లు, 8,945 దరఖాస్తులు..
జిల్లాకు 406 యూనిట్లను మంజూరుచేయగా 8,945 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో యూనిట్‌కు 22 మంది పోటీపడుతున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 14 నుంచి మే పదో తేదీ వరకు దరఖాస్తులను స్వీక రించాలి. అయితే, కొన్ని కారణాల వల్ల ఏడో తేదీ నుంచి ఆన్‌లైన్ వెబ్‌సైట్ నిలిచిపోయింది. మరో రెండు, మూడు రోజుల్లో మళ్లీ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే, ప్రస్తుతం 32 కేటగిరీలకు సంబంధించి వస్తు తయారీ, సేవల యూనిట్లకు రుణాలను అందిస్తున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉందంటున్నారు. ఇందులో టెంట్ హౌస్, చిరు దుకాణాలు ఏర్పాటు వంటివి చేర్చనున్నట్టు అధికారులు వెల్ల డించారు. దీంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ యూనిట్లకు రుణాలు..
ఇప్పటివరకూ ఫ్లవర్ బొకే మేకింగ్ అండ్ డెకరేషన్, వర్మీ కంపోస్ట్ అండ్ ఆర్గానిక్ మాన్యుర్, వైబ్‌సైట్ డెవలప్‌మెంట్ అండ్ ఐటీ సర్వీసెస్, ఎల్‌ఈడీ బల్బులు అండ్ ఎనర్జీ సేవింగ్ డివైజ్ అసెంబ్లింగ్, ప్లంబింగ్ అండ్ ఎలక్ర్టీషియన్ సర్వీసెస్, వాటర్ బాటిల్ రీఫిల్ అండ్ ఫ్యూరిఫికేషన్ కియోస్క్, వాటర్ రీసైక్లింగ్ అండ్ అప్ సైక్లింగ్ బిజినెస్, మొబైల్ రిపేరింగ్ అండ్ ఎలక్ర్టానిక్ సర్వీసెస్, సోప్, డిటర్జెంట్ అండ్ మేకింగ్స్, ఫిష్ ఫార్మింగ్ (అగ్రికల్చర్), అడ్వంచర్ టూరిజం (ట్రెక్కింగ్ అండ్ క్యాంపింగ్), మొబైల్ కార్ వాష్ అండ్ సర్వీస్, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ యూనిట్, ఫ్లైయాష్ బ్రిక్ ప్రొడక్షన్, స్కిల్ ప్రొడక్షన్, వాటర్ ఫ్యూరిఫికేషన్, వెల్డింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ యూనిట్, జూట్ బ్యాగ్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ మేకింగ్, సోలార్ ఎనర్జీ ప్రొడక్టు సేల్స్ అండ్ ఇన్‌స్టాలేషన్, సోలార్ ప్యానల్ అసెంబ్లింగ్ అండ్ ఇన్‌స్టాలేషన్, కాయిర్ ప్రొడక్ట్ మానుఫ్యాక్చరింగ్, ఫొటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, ఆయుర్వేదిక్ క్లినిక్, జనరిక్ మెడికల్ షాప్, బ్యూటీ పార్లర్, మెడికల్ ల్యాబ్, ఈవీ బ్యాటరీ చార్జింగ్ యూనిట్, పాసింజర్ ఆటో (3 వీలర్-ఈ ఆటో), పాసింజర్ ఆటో (4 వీలర్), పాసింజర్ కార్స్ (4 వీలర్), గూడ్స్ ట్రక్, డ్రోన్స్ ఫర్ అగ్రికల్చర్ (గ్రూప్ ఆక్టివిటీ) వంటివి ఉన్నాయి. వీటికి మరిన్ని సెక్టార్లను జోడించనున్నట్టు చెబుతున్నారు.