Share News

హార్బర్‌లో ఫిక్స్‌డ్‌ జెట్టీలు

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:53 AM

ఫిషింగ్‌ హార్బర్‌లో మత్స్యకారుల మాటే నెగ్గింది. వారి డిమాండ్‌ ప్రకారమే ఫ్లోటింగ్‌ జెట్టీలకు బదులుగా ఫిక్స్‌డ్‌ జెట్టీల నిర్మాణాన్ని విశాఖపట్నం పోర్టు యాజమాన్యం చేపట్టింది.

హార్బర్‌లో ఫిక్స్‌డ్‌ జెట్టీలు

మత్స్యకారుల డిమాండ్‌ మేరకే నిర్మాణం

రూ.151 కోట్లతో తొలుత ఆధునికీకరణ పనులు

రూ.178.51 కోట్లకు పెరిగిన బడ్జెట్‌

పూర్తి కావడానికి ఆరు నెలల సమయం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఫిషింగ్‌ హార్బర్‌లో మత్స్యకారుల మాటే నెగ్గింది. వారి డిమాండ్‌ ప్రకారమే ఫ్లోటింగ్‌ జెట్టీలకు బదులుగా ఫిక్స్‌డ్‌ జెట్టీల నిర్మాణాన్ని విశాఖపట్నం పోర్టు యాజమాన్యం చేపట్టింది. వీటి పనులు ప్రస్తుతం చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. పూర్తి కావడానికి ఇంకో ఆరు నెలలు పడుతుందని అంచనా.

కేంద్ర ప్రభుత్వం సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెంచడానికి దేశంలోని ఫిషింగ్‌ హార్బర్లను ఆధునికీకరించి వసతులు సమకూర్చేందుకు నడుం కట్టింది. అందులో భాగంగా విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరణకు 2022లో ప్రణాళిక సిద్ధమైంది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద రూ.151.81 కోట్లు మంజూరు చేసింది. సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫిషింగ్‌ హార్బర్‌లో మత్స్యకారులకు అవసరమైన వసతులతో పాటు అదనపు జెట్టీలను కూడా నిర్మించడానికి డీపీఆర్‌ తయారుచేశారు. ప్రస్తుతం హార్బరులో 11 జెట్టీలు ఉండగా, బోట్లు 680 లంగరేసుకొని ఉంటున్నాయి. అప్పట్లో కేవలం 400 బోట్లు ఉండగా వాటికి అనుగుణంగా 11 జెట్టీలే నిర్మించారు. ఆ తరువాత బోట్ల సంఖ్య బాగా పెరగడంతో వాటి కోసం మూడు ఫ్లోటింగ్‌ జెట్టీలు నిర్మిస్తామని పోర్టు యాజమాన్యం ప్రకటించింది. దీనిని మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఫ్లోటింగ్‌ జెట్టీ శాశ్వతంగా ఉండదని, పైగా వాటిపై చేపలను దించి, ఎత్తుకోవడానికి ఇబ్బంది అవుతుందని తెలియజేశారు. మత్స్యకార సంఘాలన్నీ ఏకమై ధర్నాలు చేయడంతో పోర్టు యాజమాన్యం ఫింగర్‌ జెట్టీలు (పర్మినెంట్‌) నిర్మించడానికి అంగీకరించింది. అయితే మూడింటికి బదులు రెండే నిర్మిస్తామని పేర్కొంది. ఆ ప్రకారం జీరో జెట్టీకి సమీపాన వాటి నిర్మాణాన్ని చేపట్టింది.

పెరిగిన వ్యయం

తొలుత కేంద్ర ప్రభుత్వం హార్బర్‌ ఆధునికీకరణకు రూ.151 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఆ తరువాత పనుల ప్రారంభంలో జాప్యం, ఫ్లోటింగ్‌ జెట్టీలకు బదులుగా ఫింగర్‌ జెట్టీల నిర్మాణం చేపట్టాల్సి రావడంతో బడ్జెట్‌ రూ.178.51 కోట్లకు పెంచారు. అందులో కేంద్ర మత్స్య శాఖ రూ.50 కోట్లు, నౌకాయాన శాఖ రూ.50 కోట్లు, విశాఖపట్నం పోర్టు రూ.50.96 కోట్లు సమకూర్చాయి. మిగిలిన మొత్తం అంటే రూ.27.55 కోట్లు పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యం కింద సమీకరించారు. హార్బర్‌ ఆధునికీకరణ పనుల్లో ఎఫులియెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు, అంతర్గత రహదారులు, కాలువలు, కోల్ట్‌ స్టోరేజీ, ప్యాకింగ్‌ యూనిట్‌, ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌, ఆఫీస్‌ భవనం పూర్తయ్యాయి. చేపలను వేలం వేసుకునే హాళ్లు, ఫింగర్‌ జెట్టీలు నిర్మాణంలో ఉన్నాయి.

ఇంకో ఆరు నెలలు

లక్ష్మణరావు, జాయింట్‌ డైరెక్టర్‌, మత్స్య శాఖ

ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణ పనులు కాసింత నెమ్మదిగా జరుగుతున్నాయి. వర్షాలు, తుఫాన్ల కారణంగా అనుకున్న సమయానికి పనులు పూర్తికావడం లేదు. నవంబరు నెలాఖరుకే పూర్తిచేస్తామని పోర్టు యాజమాన్యం తెలిపింది. అయితే ఇప్పుడు జరుగుతున్న తీరు ప్రకారం చూస్తే ఇంకో ఆరు నెలలు పడుతుందని భావిస్తున్నాం.

Updated Date - Nov 21 , 2025 | 12:53 AM