Share News

విషం చిమ్మిన రాత్రికి ఐదేళ్లు

ABN , Publish Date - May 07 , 2025 | 12:55 AM

ఐదేళ్ల క్రితం ఇదే రోజున (2020 మే 7) నగరంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది.

విషం చిమ్మిన రాత్రికి ఐదేళ్లు

  • వెన్నాడే చేదు జ్ఞాపకం

  • ఎల్జీ పాలిమర్స్‌ విషవాయువు లీకై నాడు 15 మంది మృతి

  • అస్వస్థతకు గురైన వందలాది మంది..

  • అందరికీ అందని పరిహారం

  • కార్యరూపం దాల్చని ఆస్పత్రి నిర్మాణం ప్రకటన

  • వైద్య నిపుణుల నివేదికలు బుట్టదాఖలు

గోపాలపట్నం, మే 6 (ఆంధ్రజ్యోతి):

ఐదేళ్ల క్రితం ఇదే రోజున (2020 మే 7) నగరంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. గోపాలపట్నం సమీపానున్న ఎల్జీ పాలిమర్స్‌ నుంచి స్టైరిన్‌ అనే వాయువు లీకై 15 మంది (అదేరోజు 12 మంది, ఆ తరువాత ముగ్గురు) మృతిచెందారు. వందలాది మంది ఆస్పత్రి పాలయ్యారు. వేలాది మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇళ్లు వదిలి పరుగులు తీశారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని మూడు రోజులపాటు నగరవాసులకు కంటి మీద కునుకు లేదు. ఐదేళ్లైనా నేటికీ ఆ దుర్ఘటన గుర్తొస్తే వెంకటాపురంతో పాటు ఫ్యాక్టరీ సమీపానున్న నందమూరి నగర్‌, వెంకటాద్రి గార్డెన్స్‌, జనతా కాలనీ, పద్మనాభ నగర్‌, ఎస్సీ, బీసీ కాలనీలు, కంపరపాలెం కాలనీల ప్రజలు భయకంపితులు అవుతుంటారు.

నేటికీ అందని పరిహారం

విషవాయువు కారణంగా మృతిచెందిన వారికి రూ.కోటి చొప్పున, ఇబ్బందిపడిన సుమారు 20 వేల మందికి రూ.10 వేలు చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అయితే ప్రమాదం జరిగినరోజు మృతిచెందిన 12 మందికి రూ.కోటి చొప్పున పరిహారం అందినా, ఆ తరువాత వారం వ్యవధిలో చనిపోయిన ముగ్గురికి సంబంధించి సాయం అందలేదు. అలాగే వెంకటాపురం గ్రామానికి చెందిన 180 మందికి నేటికీ రూ.10 వేల పరిహారం అందలేదు.

నివేదికలు బుట్టదాఖలు

ప్రమాద నేపథ్యంలో నేషనల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూషన్‌ (నీరీ) సంస్థ ఈ ప్రాంతంలో పర్యావరణం, భూగర్భ జలాలు, వాయుకాలుష్య తీవ్రత తదితర అంశాలపై పరిశోధన చేసింది. అదేవిధంగా నలుగురు వైద్యుల బృందం సుదీర్ఘ పరిశోధన జరిపి ప్రమాదం జరిగిన ప్రదేశంలో చేపట్టాల్సిన చర్యలపై అనేక సూచనలు చేసింది. స్టైరిన్‌ ప్రభావం వల్ల ప్రజలకు సుదీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు తలెల్తే ప్రమాదం ఉన్నందున తరచూ పరీక్షలు నిర్వహిస్తూ, వారికి అవసరమైన వైద్య సేవలు అందించాలని పేర్కొంది. అయితే సహాయక చర్యలపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

నీరుగారిన ఆస్పత్రి నిర్మాణం ప్రతిపాదన

బాధితులకు దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణుల పరిశోధనలో తేలింది. ఈ క్రమంలో వెంకటాపురం గ్రామంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని గత ప్రభుత్వంలో నేతలు హామీ ఇచ్చినా నెరవేరలేదు.

కూటమి అధికారంలోకి వచ్చాక...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిత్తూరులోని శ్రీసిటీలో ఎల్జీ కెమికల్స్‌ సంస్థ పునఃప్రారంభమైంది. అందులో వెంకటాపురం గ్రామానికి చెందిన సుమారు 20 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. దీంతో పాటు ఎల్జీ బాధితులకు సుమారు రూ.60 కోట్లు పరిహారం అందేశారు.

బాధితులకు పరిహారం అందజేయాలి

ఎన్‌.శ్రీనివాసరావు, బాధితుల సంఘ కార్యదర్శి

ఎల్జీ విషవాయువు ఘటనలో బాధితులకు పరిహారం అందించడంలో గత ప్రభుత్వం విఫలమైంది. గ్రామంలోని బాధితులను విస్మరించి రాజకీయ లబ్ధి కోసం గోపాలపట్నంలోని పలు ప్రాంతాల వారికి పరిహారం అందజేశారు. ప్రస్తుతం ఘటన జరిగిన ఐదేళ్లు గడిచినా గ్రామానికి చెందిన 38 కుటుంబాలకు చెందిన 180 మందికి ఇంకా పరిహారం అందలేదు. ఆ రూ.10 వేలతో పాటు ఇటీవల ఎల్జీ సంస్థ అందించిన ఆర్థిక సాయం ఆ కుటుంబాలకు అందజేయాలి.

అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి

ఇల్లపు లక్ష్మి, వెంకటాపురం గ్రామం

విషవాయువు లీకేజీ జరిగిన సమయంలో మా కుటుంబ సభ్యులంతా మూర్ఛపోయి కొన ఊపిరితో ఆస్పత్రిలో చేరాము. నేటికీ అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఎల్జీ పాలిమర్స్‌ బాధితులకు ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పూర్తిగా ఉచిత వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.

Updated Date - May 07 , 2025 | 12:55 AM