Share News

ఫైబర్‌ తెప్ప బోల్తా పడి మత్స్యకారుడి మృతి

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:21 PM

సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకారుడు ప్రమాదవశాత్తూ ఫైబర్‌ తెప్ప బోల్తా పడడంతో మృతి చెందాడు.

ఫైబర్‌ తెప్ప బోల్తా పడి మత్స్యకారుడి మృతి
మృతుడు చేపల మసేను (ఫైల్‌ ఫొటో)

తిక్కవానిపాలెం తీరంలో ఘటన

పరవాడ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకారుడు ప్రమాదవశాత్తూ ఫైబర్‌ తెప్ప బోల్తా పడడంతో మృతి చెందాడు. మండలంలోని తిక్కవానిపాలెం వద్ద సముద్రతీరంలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తిక్కవానిపాలెం గ్రామానికి చెందిన చేపల మసేను(45)తో పాటు దూడ పరదేశి, సూరాడ చంద్రరావు, మేరుగు రాజయ్య, సూరాడ నాగమయ్య, సూరాడ దేశిరాజు, చేపల ప్రసాద్‌ శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఫైబర్‌ తెప్ప పై తిక్కవానిపాలెం సముద్రతీరంలో చేపల వేటకు బయలుదేరారు. వీరు వెళ్లిన కొద్దిసేపటికే ఒక్కసారిగా భారీ కెరటం రావడంతో ఫైబర్‌ తెప్ప బోల్తా పడింది. ఈ క్రమంలో అలల ధాటికి చేపల మసేను గల్లంతయ్యాడు. మిగతా మత్స్యకారులు అతని కోసం గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వారు ఒడ్డుకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చేపల మసేను మృతదేహం తిక్కవానిపాలెం - ముత్యాలమ్మపాలెం తీరం మధ్య ఒడ్డుకు కొట్టుకువచ్చింది. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మసేను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు. ఈ మేరకు సీఐ ఆర్‌.మల్లికార్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 25 , 2025 | 11:21 PM