Share News

నగర సుందరీకరణకు తొలి ప్రాధాన్యం

ABN , Publish Date - Jun 22 , 2025 | 01:09 AM

నగర సుందరీకరణకు, పారిశుధ్యం మెరుగుకు తొలి ప్రాధాన్యం ఇస్తానని జీవీఎంసీ నూతన కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ పేర్కొన్నారు.

నగర సుందరీకరణకు తొలి ప్రాధాన్యం

  • పారిశుధ్యం మెరుగుకు కృషి

  • మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట

  • జీవీఎంసీ నూతన కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

విశాఖపట్నం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి):

నగర సుందరీకరణకు, పారిశుధ్యం మెరుగుకు తొలి ప్రాధాన్యం ఇస్తానని జీవీఎంసీ నూతన కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు. తాగునీరు, వీధి దీపాలు, కాలువలు, రోడ్లు మొదలైన వాటికి ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. జీవీఎంసీ, కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాల నిధులు సక్రమంగా వినియోగించి నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు ప్రజా ప్రతినిధులు, కౌన్సిల్‌, మేయర్‌, కార్పొరేటర్ల సహకారాన్ని తీసుకుంటామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశంలోనే ఉత్తమ ర్యాంకు సాధించేందుకు కృషిచేస్తానన్నారు. విశాఖ అభివృద్ధి కోసం ప్రతిపాదిత మెట్రో ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లకు జీవీఎంసీ తరఫున సహకరిస్తామన్నారు.

నగరంలోని ఖాళీ స్థలాలను సుందరంగా తీర్చిదిద్ది, అభివృద్ధి చేస్తామన్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తానన్నారు. వర్షాకాలం దృష్ట్యా ప్రధాన కాలువల్లోని వ్యర్థాలు తొలగించేలా చర్యలు చేపడతామని, సీజనల్‌ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ జ్వరాలపై సర్వే నిర్వహిస్తామన్నారు. దోమల నివారణకు ఫాగింగ్‌, స్ర్పేయింగ్‌, సీడ్‌ బాల్స్‌ వెదజల్లుతామన్నారు. పాత నగరంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పరిష్కరిస్తామన్నారు. నగరంలోని సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌, జీవీఎంసీ సమన్వయంతో నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌కు పలువురు ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jun 22 , 2025 | 01:09 AM