ప్రతామ్నాయం... దైవాధీనం!
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:15 AM
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం మనుగడకు, స్వామివారి ధూప దీపాలకు దాతలు ఉదారంగా ఇచ్చిన భూములు కాలక్రమేణా తరిగిపోతున్నాయి.
వివిధ అవసరాలకు సింహాచలేశుడి భూములు
1972లో ఎన్‌ఎస్‌టీఎల్‌తో మొదలు...
తాజాగా రైడెన్‌కు 100 ఎకరాలు
ఇప్పటివరకూ 385 ఎకరాలు కేటాయింపు
ప్రత్యామ్నాయ భూముల సాధనలో దేవదాయ శాఖ విఫలం
అధికారుల నిర్లక్ష్యమే కారణమని భక్తుల ఆరోపణ
సింహాచలం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి):
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం మనుగడకు, స్వామివారి ధూప దీపాలకు దాతలు ఉదారంగా ఇచ్చిన భూములు కాలక్రమేణా తరిగిపోతున్నాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ పరిసర ప్రాంతాల్లోనే ఈ భూములు ఉండడంతో తప్పనిసరి పరిస్థితిలో ప్రభుత్వాలు వివిధ సంస్థలకు కేటాయిస్తున్నాయి. అయితే అందుకు ప్రతిగా ప్రత్యామ్నాయ భూములు అందిస్తామని హామీ ఇస్తున్నాయి. కాగా ప్రత్యామ్నాయ భూములను దేవస్థానానికి బదిలీ చేయించడంలో దేవదాయ శాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా దేవుని మాన్యం తరిగిపోతోంది.
విశాఖ పరిసరాల్లో ప్రభుత్వాలు చేపట్టదలచిన పలు నిర్మాణాలకు సింహాచలం దేవస్థానానికి చెందిన భూములను తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటిది కాదు. 1972 నుంచే ప్రారంభమైంది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఎస్‌టీఎల్‌కు సుమారు 38 ఎకరాలను కేటాయించారు. తాజాగా రైడెన్ డేటా సెంటర్‌కు సుమారు 100 ఎకరాలు కేటాయించనున్నారు. ఇప్పటివరకూ సుమారు 385 ఎకరాల దేవస్థానం భూమిని వివిధ సంస్థలకు కేటాయించారు.
ఇవీ నిబంధనలు
నిబంధనలను అనుసరించి దేవస్థానం భూములు కేటాయించాలంటే మార్కెట్ ధర చెల్లించాలి. లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలి. అదీకాకుంటే తీసుకున్న కమతానికి సరిపడా ప్రత్యామ్నాయ భూమిని తిరిగి దేవస్థానానికి బదలాయించాలి. అయితే ఈ నిబంధనల మేరకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని ప్రకటిస్తున్నా, వాటిని తీసుకోవడంలో దేవదాయ శాఖ అధికారులు విఫలమవుతున్నారు. ఐదు దశాబ్దాలుగా పలు ప్రభుత్వ సంస్థలకు దేవదాయ శాఖ అధికారులు వందలాది ఎకరాలు అప్పగించారు. ప్రతిఫలం సాధించడంలో చొరవ చూపడం లేదు.
దేవస్థానం రికార్డుల ప్రకారం వివిధ సంస్థలకు కేటాయించిన భూముల వివరాలివి
1. 1972, 1985: ఎన్‌ఎస్‌టీఎల్, డిఫెన్స్ క్వార్టర్స్‌కు 37.75 ఎకరాలు
2. 1979లో మైక్రోవేవ్ రిపీటర్ స్టేషన్ (ఎస్‌ఈ రైల్వే)కు 33.41 ఎకరాలు
3. 1982లో ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (వేపగుంట) కు 144.75 ఎకరాలు
4. 1986లో బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలకు 45.32 ఎకరాలు
5. తాజాగా రైడెన్ డేటా సెంటర్‌కు 100 ఎకరాలు
వీటితోపాటు నీటి పారుదల శాఖ కార్యాలయం, రిజర్వాయర్ నిర్మాణానికి, పబ్లిక్ హెల్త్ శాఖ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీతమ్మధారలో వీకర్ సెక్షన్, వెంకోజీపాలెంలో ఎస్సీ కాలనీ నిర్మాణానికి, కేంద్ర ప్రభుత్వానికి చెందిన టీవీ స్టేషన్, టవర్ ఏర్పాటుకు, వెంకోజీపాలెం నుంచి హనుమంతవాక వరకు హైవే విస్తరణకు, వేపగుంట పంచాయతీ ప్రహ్లాదపురంలో వెనుకబడిన ఇళ్ల కాలనీ నిర్మాణానికి ప్రభుత్వాలు గతంలో సుమారు 284 ఎకరాలు కేటాయించాయి. ఏపీఎస్ ఆర్టీసీకి సర్వే నంబర్లు 197, 198లో సింహాచలం డిపో నిర్మాణానికి 5.3 ఎకరాలు కేటాయించారు. దేవస్థానానికి ఆర్టీసీ రూ.10 లక్షలు చెల్లించింది. ఇప్పటివరకు దేవస్థానం ఖాతాకు జమ అయిన మొత్తం ఇదే. తాజాగా రైడెన్ డేటా సెంటర్‌కు అడివివరం సర్వేనంబరు 275లో 100 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ భూములు సాధించడం లేదా దేవస్థానం ఖజానాకు భూముల మార్కెట్ విలువ చేరేలా చర్యలు తీసుకోవడంపై దేవదాయ శాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించాలని భక్తులు కోరుతున్నారు.