ప్రైవేటుకు ఫైర్ వింగ్!
ABN , Publish Date - Jul 11 , 2025 | 01:24 AM
స్టీల్ ప్లాంటు యాజమాన్యం మరో విభాగాన్ని ప్రైవేటుకు ఇవ్వడానికి రెండు రోజుల క్రితం ప్రకటన జారీచేసింది. ప్లాంటులో ఎటువంటి ప్రమాదం జరిగినా తక్షణం స్పందించి సహాయ సహకారాలు అందించే అగ్నిమాపక విభాగాన్నే ఈసారి కాంట్రాక్టుకు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రెండేళ్లకు రూ.18.24 కోట్లు ఇస్తామని, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేయాలని కోరింది.
స్టీల్ ప్లాంటులో మరో విభాగం కాంట్రాక్టుకు...
తొలుత సీఐఎస్‌ఎఫ్ తొలగింపు
ఆపై ఏపీఎస్‌ఎఫ్ కోసం యత్నించి విఫలం
సొంత సిబ్బందికే శిక్షణ ఇవ్వాలని
మరో ప్రయత్నం
ఎక్కడా స్పందన లేకపోవడంతో
ఇక తప్పదని నోటిఫికేషన్
రెండేళ్లకు రూ.18.24 కోట్లకు ఇస్తామని ప్రకటన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్టీల్ ప్లాంటు యాజమాన్యం మరో విభాగాన్ని ప్రైవేటుకు ఇవ్వడానికి రెండు రోజుల క్రితం ప్రకటన జారీచేసింది. ప్లాంటులో ఎటువంటి ప్రమాదం జరిగినా తక్షణం స్పందించి సహాయ సహకారాలు అందించే అగ్నిమాపక విభాగాన్నే ఈసారి కాంట్రాక్టుకు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రెండేళ్లకు రూ.18.24 కోట్లు ఇస్తామని, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేయాలని కోరింది.
వాస్తవానికి సిబ్బంది కుదింపులో భాగంగానే ఈ విభాగం ప్రైవేటీకరణకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది డిసెంబరులోనే ఎవరైనా ప్రైవేటు పార్టీ ముందుకువస్తే ఇచ్చేస్తామని ప్రకటించింది. కానీ ఎవరూ ఆసక్తి చూపలేదు. ప్లాంటులో మూడు ఫైర్ స్టేషన్లు, 13 ఫైర్ ఇంజన్లు (అగ్నిమాపక వాహనాలు), 282 మంది శాశ్వత సిబ్బంది ఉండేవారు. ప్లాంటులోని వివిధ విభాగాల్లో 2,744 ఫైర్ హైడ్రెంట్లు, 1,071 ఎక్స్‌టర్నల్ ఫైర్ హైడ్రెంట్లు, 86 మానిటరింగ్ కేంద్రాలు, 28 ఫైర్ ఫైటింగ్ పంప్‌హౌస్‌లు, వివిధ ప్రాంతాల్లో 14 వేల ఫైర్ ఎక్స్‌టింగ్‌విషర్లు ఉన్నాయి. రసాయన ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని అదుపులోకి తేవడానికి కార్బన్ డయాక్సైడ్, ఫోమ్‌తో కూడిన ప్రత్యేక వాహనాలు ఉన్నాయి. వీటిని గత నాలుగు దశాబ్దాలుగా శిక్షణ పొందిన సిబ్బంది నిర్వహిస్తూ వస్తున్నారు. ఉత్పత్తి జరిగే ప్లాంటును మాత్రమే కాకుండా ఉద్యోగులు నివసించే టౌన్‌షిప్, హిల్ టాప్ గెస్ట్‌హౌస్, ఆస్పత్రి, స్కూళ్లు, పోస్టాఫీసులు, ఇతర భవనాలకు కూడా వీరు రక్షణ కల్పించాల్సి ఉంది. ఈ విభాగంలో అంతా సీఐఎస్‌ఎఫ్ సిబ్బందే ఉండేవారు. అయితే స్టీల్ ప్లాంటు యాజమాన్యం మొత్తం సీఐఎస్‌ఎఫ్‌నే తొలగించారు. దాంతో ఈ విభాగాన్ని ప్రైవేటుకు అప్పగించక తప్పలేదు.
ఫైర్ సర్వీస్ సెక్షన్‌కు స్పందన శూన్యం
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీ స్పెషల్ ఫోర్స్ నుంచి ఎవరైనా డిప్యుటేషన్‌పై వస్తే వారిని తీసుకుంటామని, ఫైర్ విభాగాన్ని వారికే అప్పగిస్తామని స్టీల్ ప్లాంటు యాజమాన్యం ప్రకటించింది. సంప్రతింపులు జరిపింది. అయితే అటు నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదు. దాంతో ప్లాంటులోని అన్ని విభాగాలకు సర్క్యులర్ పంపింది. కొత్తగా ‘ఫైర్ సర్వీస్ సెక్షన్’ ప్రారంభిస్తున్నామని, అందులో పనిచేయడానికి ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ సిబ్బంది ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చునని జూన్‌లో ప్రకటించింది. అందులో హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్‌గా ఒకరు, ఆఫీసర్లు 3, సూపర్ వైజర్లు 4, లీడ్ ఫైర్‌మెన్ 11, ఫైర్ మెన్ 44, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులు 11 ఉంటాయని, మొత్తం 74 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ముందుకు వచ్చేవారికి తామే శిక్షణ ఇస్తామని, అక్కడ పనిచేయాల్సి ఉంటుందని, గతంలో సీనియారిటీ అంతా అలాగే కొనసాగుతుందని హామీ ఇచ్చింది. అయితే ఉద్యోగులు ఎవరూ ముందుకు రాలేదు. ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంతో ఇప్పుడు అంతా ప్రైవేటు ఏజెన్సీకి ఇస్తామని టెండర్లు ఆహ్వానించింది. రెండేళ్లకు రూ.18.24 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. ప్లాంటులో ఉన్న వాహనాలు, పరికరాలు ఉపయోగించుకొని ఆపరేట్ చేస్తే సరిపోతుందని పేర్కొంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు వంటి పరిశ్రమల్లో అగ్నిమాపక దళాన్ని నిర్వహించే సమర్థత కలిగిన సంస్థలు ఎక్కడున్నాయనేది అందరినీ ఆలోచింపజేస్తోంది. ఫార్మా సిటీ, హెచ్‌పీసీఎల్, కోరమండల్...ఇలా ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా స్టీల్ ప్లాంటు వాహనాలే వెళుతుంటాయి. అలాంటి సంస్థను సమర్థంగా నిర్వహించేవారు లభిస్తారా? అనేది అనుమానం కలిగిస్తోంది.
ఇది దుర్మార్గం..వెనక్కి తీసుకోవాలి.
అయోధ్యారామ్, సీఐటీయూ నాయకులు
యాజమాన్యం ప్లాంటుకు అవసరమైన ముడిపదార్థాలు ఎలా తేవాలి? ఉత్పత్తి ఎలా పెంచాలి? మార్కెటింగ్ ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశాలపై దృష్టి పెట్టకుండా ఉద్యోగుల సంఖ్య తగ్గించడంపైనా, ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటీకరణ చేయడంపైనా కసరత్తు చేస్తోంది. ఇది దుర్మార్గమైన చర్య. దీనికోసం విడుదల చేసిన ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన వెంటనే వెనక్కి తీసుకోవాలి.