Share News

అచేతనంగా అగ్నిమాపక కేంద్రాలు

ABN , Publish Date - Apr 10 , 2025 | 01:17 AM

జిల్లాలో అగ్నిమాపక కేంద్రాలు అచేతన స్థితిలో ఉన్నాయి. కొత్త అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలు ఏళ్ల తరబడి అమలుకు నోచుకోకపోవడం లేదు. ప్రస్తుతం వున్న కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. జిల్లా కేంద్రం మినహా మిగిలినచోట్ల ఒక్కో అగ్నిమాపక శకటం మాత్రమే వుంది. ఈ కేంద్రం పరిధిలో ఒకేసారి వేర్వేరుచోట్ల అగ్నిప్రమాదాలు జరిగితే సకాలంలో మంటలను ఆదుపుచేయని పరిస్థితి ఏర్పడుతున్నది. జిల్లాల పునర్విభజన తరువాత ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం మినహా గతంలో ఉన్న అగ్నిమాపక కేంద్రాలకు ఎటువంటి అదనపు వసతులు, సౌకర్యాలు కల్పించలేదు. నిబంధనల ప్రకారం 50 వేల మంది జనాభాకు, ప్రతి 20 కిలోమీటర్ల పరిధిలో ఒక అగ్నిమాపక కేంద్రం వుండాలి.

అచేతనంగా అగ్నిమాపక కేంద్రాలు
శిథిలమైన ఆర్‌ఐ క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన సబ్బవరం అగ్నిమాపక కేంద్రం

జిల్లాలో 24 మండలాలు.. ఉన్నది ఎనిమిది ఫైర్‌ స్టేషన్లు

నర్సీపట్నం పరిధిలో రెండు జిల్లాలు, తొమ్మిది మండలాలు

బోర్లు లేని రావికమతం, మాడుగుల, నక్కపల్లి

నీటి కోసం గెడ్డలు, వాగులు, వ్యవసాయ బావులే దిక్కు

పరాయి పంచన సబ్బవరం కేంద్రం

అనకాపల్లి మినహా మిగిలిన అన్నిచోట్ల ఒక్కొక్క శకటం

పలు కేంద్రాల్లో సిబ్బంది కొరత

కొత్త ఫైర్‌ స్టేషన్ల ఏర్పాటుపై తీవ్ర జాప్యం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో అగ్నిమాపక కేంద్రాలు అచేతన స్థితిలో ఉన్నాయి. కొత్త అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలు ఏళ్ల తరబడి అమలుకు నోచుకోకపోవడం లేదు. ప్రస్తుతం వున్న కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. జిల్లా కేంద్రం మినహా మిగిలినచోట్ల ఒక్కో అగ్నిమాపక శకటం మాత్రమే వుంది. ఈ కేంద్రం పరిధిలో ఒకేసారి వేర్వేరుచోట్ల అగ్నిప్రమాదాలు జరిగితే సకాలంలో మంటలను ఆదుపుచేయని పరిస్థితి ఏర్పడుతున్నది. జిల్లాల పునర్విభజన తరువాత ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం మినహా గతంలో ఉన్న అగ్నిమాపక కేంద్రాలకు ఎటువంటి అదనపు వసతులు, సౌకర్యాలు కల్పించలేదు. నిబంధనల ప్రకారం 50 వేల మంది జనాభాకు, ప్రతి 20 కిలోమీటర్ల పరిధిలో ఒక అగ్నిమాపక కేంద్రం వుండాలి. ఈ ప్రకారం జిల్లాలో కనీసం మండలానికి ఒకటి చొప్పున అగ్నిమాపక కేంద్రాలు అవసరం. కానీ ప్రస్తుతం ఎనిమిదిచోట్ల (వీటిలో రెండింటిని ప్రైవేటు ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి) మాత్రమే ఫైర్‌ స్టేషన్లు వున్నాయి. సబ్బవరం కేంద్రానికి సొంత భవనం లేదు. మిగిలిన కేంద్రాలకు సొంత భవనాలున్నా సిబ్బంది లేమి, వసతుల కొరత వేధిస్తున్నాయి. ప్రతి కేంద్రంలో కనీసం 15 మంది సిబ్బంది వుండాలి. కానీ అన్నిచోట్ల పది మంది లోపే ఉన్నారు. ఖాళీ పోస్టులు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోకపోవడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతున్నది. వేసవిలో సెలవులు తీసుకునే పరిస్థితి లేదు.

అగ్నిమాపక కేంద్రం లేని పారిశ్రామిక ప్రాంతాలు

జిల్లాలోని అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ మండలాల్లో వివిధ రకాల పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు వున్నాయి. వీటిల్లో తరచూ అగ్ని ప్రమాదాలు, రసాయనాల లీకేజీలు జరుగుతుంటాయి. పరవాడ ఫార్మా సిటీలో రాంకీ తరపున ఒకటి, అచ్యుతాపురం సెజ్‌లో ఏపీఐఐసీ నిర్వహణలో ఒకటి చొప్పున అగ్నిమాపక కేంద్రాలు వున్నాయి. అయితే ఇవి ఆయా పరిశ్రమల్లో జరిగే అగ్ని ప్రమాదాలను నివారించడానికి మాత్రమే ఉపయోగపడుతుంటాయి. ఈ మండలాల్లోని గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే అనకాపల్లి, గాజువాక, ఎలమంచిలి నుంచి అగ్నిమాపక శకటాలు రావాల్సిందే.

ఉన్న సిబ్బందితోనే మెరుగైన సేవలు

ఆర్‌.వెంకటరమణ, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి

అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమే. అయినప్పటికీ అందుబాటులో ఉన్న సిబ్బందిని వినియోగించుకొని అగ్ని ప్రమాదాలను అరికట్టడానికి శక్తివంచన లేకుండా సేవలు అందిస్తున్నాం. జిల్లాలో అదనంగా అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.

జెంబో అగ్నిమాపక కేంద్రం!

రెండు జిల్లాలు.. తొమ్మిది మండలాలు

ఉన్నది ఒక్కటే శకటం

నర్సీపట్నం, ఏప్రిల్‌ 9: స్థానిక అగ్నిమాపక కేంద్రం అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో తొమ్మిది మండలాలకు సేవలు అందిస్తున్నది. కానీ ఇక్కడ ఒకేఒక్క శకటం ఉంది. డబుల్‌ యూనిట్‌ (రెండు వాహనాలు)గా అప్‌గ్రేడ్‌ చేయాలన్న ప్రతిపాదనలు కాగితాలకు పరిమితమయ్యాయి. నర్సీపట్నంలో అగ్నిమాపక కేంద్రం పరిధిలో అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం, మాకవరపాలెం, గొలుగొండ, నాతవరం, కోటవురట్ల, రోలుగుంట; అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి, మండలాలు వున్నాయి. జిల్లాల పునర్విభజన జరిగి పాడేరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడినప్పటికీ ఏజెన్సీలో కొత్తగా ఒక్కచోట కూడా అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. రాత్రి సమయంలో అగ్ని ప్రమాదాలు జరిగితే ఆస్తి నష్టాన్ని నివారించి, ప్రాణ నష్టం జరగకుండా చూడడానికి అవసరమైన సామగ్రి ఇక్కడ లేదు. ముఖ్యంగా డ్రాటన్‌ లైట్లు, హైడ్రాలిక్‌ కట్టర్స్‌, గ్యాస్‌ కట్టర్స్‌, హైడ్రాలిక్‌ జాకీ, సిబ్బందికి ఫైర్‌ షూస్‌, హీట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, కళ్లకు వేడి తగలకుండా గాగుల్స్‌, మాస్కులు, డోర్‌ బ్రేకర్స్‌ వంటివి లేవు. అగ్నిమాపక కేంద్రం ఆవరణలో ఉన్న బోరు వున్నప్పటికీ వేసవిలో అడుగంటుతుంది. దీంతో ఉత్తర వాహిని (వరహా నది)కి వెళ్లి నీటిని నింపుకోవాల్సి రావల్సి వస్తుంది. అగ్నిమాపక కేంద్రంలో ఒక ఫైర్‌ ఆఫీసరు, ముగ్గురు లీడింగ్‌ ఫైర్‌మెన్‌, తొమ్మిది మంది పైర్‌ మెన్‌, ముగ్గురు డ్రైవర్‌ ఆపరేటర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం ఆరు ఫైర్‌మెన్‌, రెండు డ్రైవర్‌ ఆపరేటర్ల పోస్టులు ఖాళీగా వున్నాయి.

ఎక్కువ పరిధితో ఇబ్బందులు

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక అగ్నిమాపక కేంద్రం పరిధిలో అనకాపల్లి పట్టణం, మండలం, కశింకోట, మునగపాక, పరవాడ మండలాలు వున్నాయి. జిల్లా కేంద్రం ఏర్పాటు కాకముందు ఒక అగ్నిమాపక శకటం మాత్రమే వుండేది. కొత్త జిల్లాల ఏర్పాటు విశాఖ నుంచి మరో అగ్నిమాపక శకటాన్ని ఇక్కడకు పంపారు. కాగా 2013లో ఈ కేంద్రానికి బుల్లెట్‌ వాహనం మంజూరైంది. దీనికి గ్యాస్‌, ఫోమ్‌ సిలిండర్లు వుంటాయి. అగ్నిమాపక శకటాలు వెళ్లలేని చిన్నపాటి వీధుల్లోకి బుల్లెట్‌ ద్వారా వెళ్లి అగ్నిప్రమాదాలు నివారించే వారు. అయతే నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. కాగా అగ్నిమాపక కేంద్రంలో పూర్తిస్థాయిలో సిబ్బంది వున్నారు. ఈ కేంద్రం పరిధి అధికంగా వుండడంతో శివారు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగితే.. అనకాపల్లి నుంచి శకటం వెళ్లేలోపు పరిస్థితి చేయి దాటిపోతున్నది. కశింకోట మండలం తాళ్లపాలెంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం వుంది.

నీటి సదుపాయం లేని ‘రావికమతం’

రావికమతం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి సమీపంలోని గర్నికంలో సుమారు రెండు దశాబ్దాల క్రితం ప్రైవేటు ఏజెన్సీ ద్వారా అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రావికమతం, బుచ్చెయ్యపేట, రోలుగుంట మండలాల్లో దాదాపు 40 పంచాయతీలు ఈ కేంద్రం పరిధిలో వున్నాయి. అగ్నిమాపక కేంద్రానికి ఇంతవరకు నీటి సౌకర్యం (బోరు) కల్పించలేదు. ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే.. దారిలో వున్న చెరువులు/ గెడ్డలు/ వ్యవసాయ బావుల్లో నుంచి నీటిని తోడుకొని వెళతారు. దీనివల్ల ప్రమాదం జరిగిన ప్రదేశానికి శకటం సకాలంలో వెళ్లలేకపోవడంతో ఆస్తినష్టం పెరిగిపోతున్నది. కాగా ప్రైవేటు ఏజెన్సీ నిర్వహణలో వున్న ఈ కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందికి ఎనిమిది నెలల నుంచి వేతనాలు అందడంలేదు.

మాడుగులలో సిబ్బంది కొరత

మాడుగుల రూరల్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక అగ్నిమాపక కేంద్రం పరిధిలో మాడుగుల మండలం పూర్తిగా, చీడికాడ మండలంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. బోరు వున్నప్పటికీ నీరు సరిగా రాదు. దీంతో సమీపంలోని తాచేరు నది, ఆరు కిలోమీటర్ల దూరంలో వాడపాడు వద్ద పెద్దేరు నదిలో నుంచి నీటిని నింపుకుంటున్నారు. అధికారి, సిబ్బంది కలిపి మొత్తం 16 మంది వుండాలి. కానీ ప్రస్తుతం ఒక లీడింగ్‌ ఫైర్‌మన్‌, ఒక డ్రైవర్‌, ఏడు ఫైర్‌మెన్‌ పోస్టులు ఖాళీగా వున్నాయి. భవనంలో సన్‌షేడ్‌ పెచ్చులూడి ఇనుప ఊచలు బయటికి కనిపిస్తూ ఎప్పుడు కూలిపోతుందో తెలియని స్థితిలో ఉంది. ఫైర్‌ ఆఫీసర్‌ గదిలో కిటకీలకు తలుపులు లేవు. మరుగు దొడ్డికి తలుపులు లేవు.

బోరు పాడై ఏడు నెలలైంది

సిబ్బందికి రెండేళ్ల నుంచి జీతాల్లేవు!

నక్కపల్లి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): సుమారు రెండు దశాబ్దాల క్రితం నక్కపల్లిలో ప్రైవేటు ఏజెన్సీ ఆధ్వర్యంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శకటం నిలుపుదలకు నిర్మించిన రేకుల షెడ్డు శిథిలావస్థకు చేరుకుంది. దీనికి ఆనుకుని సిబ్బందికి చిన్నపాటి గది మాత్రమే వుంది. బోరు మోటారు ఎనిమిది నెలల క్రితం పాడైపోయింది. దీంతో హెటెరో ఔషధ పరిశ్రమలోకి వెళ్లి శకటంలోకి నీటిని నింపుకుంటున్నారు. సిబ్బంది కొరత లేదు. ప్రైవేటు ఏజెన్సీ కావడంతో సిబ్బంది అరకొరగా జీతాలు చెల్లిస్తున్నారు. అవి కూడా రెండేళ్ల నుంచి అందడంలేదు.

పరాయి పంచన సబ్బవరం కేంద్రం

సబ్బవరం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక అగ్నిమాపక కేంద్రానికి సొంత భవనం లేదు. రెవెన్యూ శాఖకు చెందిన ఖాళీగా వున్న ఆర్‌ఐ క్వార్టర్‌లో నిర్వహిస్తున్నారు. అధికారి, సిబ్బందితో కలిపి 16 మంది ఉండాలి. కానీ రెండు పోస్టులు ఖాళీగా వున్నాయి. సొంతగూడు కోసం ప్రభుత్వం రూ.1.25 కోట్లు మంజూరు చేసింది. రెవెన్యూ అధికారులు అసకపల్లి సర్వే నంబరు-1లో 50 సెంట్లు కేటాయించారు.

అధిక పరిధితో సేవల్లో జాప్యం

ఎలమంచిలి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక అగ్నిమాపక కేంద్రం పరిధిలో ఎలమంచిలి పట్టణం, మండలంతోపాటు రాంబిల్లి, అచ్యుతాపురం మండలాలు వున్నాయి. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండడంతో పాటు ఈ రెండు మండలాల్లోని పలు గ్రామాలు సుదూరంలో వుండడంతో అగ్నిమాపక సేవలు అందించడంలో జాప్యం జరుగుతున్నది. ఈ కారణాల వల్ల అచ్యుతాపురంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏంతైనా వుంది.

Updated Date - Apr 10 , 2025 | 01:17 AM