అగ్నిమాపక సేవలు అధ్వానం
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:21 AM
జిల్లా ప్రజలకు ఎటువంటి ఆపద ఎదురైనా ఆదుకోవాల్సిన అగ్నిమాపక కేంద్రం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. పాడేరు డివిజన్ పరిధిలోని 11 మండలాలకు ఉన్న ఒకే ఒక్క అగ్నిమాపక కేంద్రం శిథిల స్థితిలో, సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. దీంతో సేవలు సక్రమంగా అందించలేని పరిస్థితిలో ఉంది.

11 మండలాలకు ఒకే ఒక్క కేంద్రం
పాడేరులో శిథిల స్థితిలో భవనం
వేధిస్తున్న సిబ్బంది కొరత
దూరంగా ఉన్న మండలాల్లో విపత్తులు సంభవిస్తే సకాలంలో వెళ్లలేని దుస్థితి
పాడేరురూరల్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజలకు ఎటువంటి ఆపద ఎదురైనా ఆదుకోవాల్సిన అగ్నిమాపక కేంద్రం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. పాడేరు డివిజన్ పరిధిలోని 11 మండలాలకు ఉన్న ఒకే ఒక్క అగ్నిమాపక కేంద్రం శిథిల స్థితిలో, సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. దీంతో సేవలు సక్రమంగా అందించలేని పరిస్థితిలో ఉంది.
జిల్లా కేంద్రం పాడేరులో ఉన్న అగ్నిమాపక కేంద్రం పాడేరు డివిజన్ పరిధిలోని 11 మండలాలకు సేవలందించాల్సి ఉంది. పాడేరు జిల్లా కేంద్రం అయిన తరువాత జిల్లా అగ్నిమాపక అధికారిగా జి.లక్ష్మణస్వామిని నియమించారు. ఇక్కడ ఉన్న అగ్నిమాపక శకటంతో పాటు అదనంగా మరో అగ్నిమాపక శకటాన్ని సమకూర్చినప్పటికి అది మరమ్మతులకు గురైంది. దీంతో ప్రస్తుతం ఒక్కటే పని చేస్తోంది. మండలాల పరిధి సుమారు 50 నుంచి 100 కిలోమీటర్లుపైగా దూరం కావడంతో అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, చింతపల్లి, కొయ్యూరు, జీకేవీధి, ముంచంగిపుట్టు మండలాల్లో ఎటువంటి విపత్తు సంభవించినా సకాలంలో వెళ్లలేని పరిస్థితి ఉంది. అగ్నిమాపక కేంద్రంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఒకరు, లీడింగ్ ఫైర్‌మన్లు ముగ్గురు, డ్రైవర్ ఆపరేటర్లు ముగ్గురు, ఫైర్‌మన్లు 9 మంది ఉండాల్సి ఉండగా, ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఫైర్ స్టేషన్‌లో పూర్తిస్థాయిలో నీరు అందుబాటులో లేదు. ఇక్కడ ఉన్న చిన్న మోటారుతో శకటంలోకి నీటిని నింపుకోవాలంటే సుమారు 2 గంటల సమయం పడుతుందని సిబ్బంది తెలిపారు. అదే విధంగా భవన నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభంకాలేదు. అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించడం తో పాటు మరిన్ని అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.