అపార్టుమెంట్‌లో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:31 AM
నగరంలోని ఆర్కే బీచ్‌రోడ్డులో నోవాటెల్ హోటల్ పక్కనున్న ఫార్చూన్ బీచ్ ఫ్రంట్ అపార్టుమెంట్‌లో బుధవారం ఉదయం అగ్నిపమాదం సంభవించింది. అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది. తొమ్మిదో అంతస్థులో గల ఫ్లాట్‌నంబర్ 905లో వృద్ధ మహిళ ఒక్కరే ఉంటున్నారు. ఉదయం ఏడు గంటల సమయంలో పూజ చేసిన తర్వాత ఆమె బెడ్‌రూమ్‌లోని కిటికీ వద్ద దీపం ఉంచి ఇంట్లో పనులు చూసుకుంటున్నారు.
అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో
స్పందించడంతో తప్పిన పెనుప్రమాదం
విశాఖపట్నం/ఆర్కే బీచ్‌రోడ్డు, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఆర్కే బీచ్‌రోడ్డులో నోవాటెల్ హోటల్ పక్కనున్న ఫార్చూన్ బీచ్ ఫ్రంట్ అపార్టుమెంట్‌లో బుధవారం ఉదయం అగ్నిపమాదం సంభవించింది. అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది. తొమ్మిదో అంతస్థులో గల ఫ్లాట్‌నంబర్ 905లో వృద్ధ మహిళ ఒక్కరే ఉంటున్నారు. ఉదయం ఏడు గంటల సమయంలో పూజ చేసిన తర్వాత ఆమె బెడ్‌రూమ్‌లోని కిటికీ వద్ద దీపం ఉంచి ఇంట్లో పనులు చూసుకుంటున్నారు. గాలికి దీపం ఎగిరి కిందపడడంతో వాల్ కర్టెన్‌కు నిప్పంటుకుంది. దీంతో మంటలు ఆ గదితోపాటు పక్కనే ఉన్న గదికి వ్యాపించాయి. పొగ బయటకు రావడంతో అపార్టుమెంట్‌వాసులు గుర్తించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ రీజినల్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్‌రెడ్డి అగ్నిమాపక శకటాలతోపాటు ఎత్తైన భవనాలపైకి వెళ్లి మంటలను ఆర్పే సదుపాయం కలిగిన బ్రాంటో స్కైలిఫ్ట్ వాహనంతో అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. అనంతరం ఆర్‌ఎఫ్‌ఓ నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తమకు సకాలంలో సమాచారం అందడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అపార్టుమెంట్‌లో ఉన్న అగ్నిమాపకపరికరాల సహాయంతో మంటలను అదుపు చేయగలిగామన్నారు. ఒంటరిగా ఉంటున్న మహిళ దీపం పెట్టడం, గాలికి ఎగిరిపడడం కారణంగానే ప్రమాదం సంభవించిందని భావిస్తున్నట్టు తెలిపారు.
అపార్టుమెంట్‌లో ఉన్న అగ్నిమాపక వ్యవస్థ బాగానే పనిచేస్తోందని కితాబిచ్చారు. ఈ సమాచారం తెలియగానే సీపీ శంఖబ్రతబాగ్చి అపార్టుమెంట్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అపార్టుమెంట్‌లో అగ్నిమాపక పరికరాలు ఉన్నప్పటికీ అవన్నీ కాలంచెల్లినవిగా గుర్తించామన్నారు. పైగా అగ్నిప్రమాదం జరిగితే వాటిని ఎలా ఉపయోగించాలనే దానిపై అపార్టుమెంట్‌వాసులకు సరైన అవగాహన లేదన్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో నగరంలోని బహుళ అంతస్థుల భవనాలు, వాణిజ్య సముదాయాల్లో అగ్నిమాపక పరికరాల పనితీరు, వాటిని వినియోగించడంపై ప్రజలకు అవగాహనపై ఫైర్ సేఫ్టీ, ఎలక్ర్టిక్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని అగ్నిమాపకశాఖ అధికారులను ఆదేశించామన్నారు.