Share News

కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:56 AM

నగరంలోని మద్దిలపాలెం ఆటోమోటివ్‌ జంక్షన్‌ వద్ద గురువారం ఉదయం కమర్షియల్‌ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది.

కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం

షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు

షోరూమ్‌లో గల కార్లకు నష్టం

సెల్లార్‌లో కారు దగ్ధం

రూ.50 లక్షల ఆస్తి నష్టం?

మద్దిలపాలెం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని మద్దిలపాలెం ఆటోమోటివ్‌ జంక్షన్‌ వద్ద గురువారం ఉదయం కమర్షియల్‌ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో లిఫ్ట్‌ వద్ద విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్ట్‌ వద్ద చెలరేగిన మంటలు భవనం మొత్తం వ్యాపించాయి. ఉదయం ఏడు గంటలకు ప్రమాదం జరగడం, అప్పటికి ఏ దుకాణం తెరుచుకోకపోవడం వల్ల ప్రాణనష్టం కలగలేదు. మంటలు మాత్రం భారీగా ఎగిసిపడ్డాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక శకటాలు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాకపోవడంతో నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి మరో 14 ఫైర్‌ ఇంజన్లను రప్పించారు. కాగా కమర్షియల్‌ భవనంలో కింద రెండు ఫ్లోర్‌లలో టాటా కార్ల షోరూమ్‌, కార్ల ఇంటీరియర్‌ వర్క్స్‌, స్పేర్‌ పార్ట్స్‌, ఫిలిప్స్‌, ఇడెన్‌ షాపులున్నాయి. పైఅంతస్థులో ఫంక్షన్‌ హాలు, జిమ్‌ ఉన్నాయి. కింది ఫ్లోర్‌లోకి మంటలు వ్యాపించడంతో కార్ల షోరూమ్‌లో కార్లు పాక్షికంగా దెబ్బదిన్నాయి. కార్ల ఇంటీరియర్‌ మెటీరియల్స్‌ పాడయ్యాయి. సెల్లార్‌లోకి మంటలు వెళ్లడంతో పార్కింగ్‌ చేసిన ఒక కారు 70 శాతం దగ్ధమైంది. మరో రెండుకార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భవనానికి నష్టం వాటిల్లింది. ఆస్తి నష్టం సుమారు రూ.50 లక్షలు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.

స్తంభించిన ట్రాఫిక్‌..

జాతీయ రహదారిపై భవనం అగ్ని ప్రమాదానికి గురై మంటలు ఎగిసిపడడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. మద్దిలపాలెం నుంచి హనుమంతువాక జంక్షన్‌ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టి పరిస్థితిని చక్కదిద్దారు.

పది మందిని రక్షించిన యువకులు

మంటలు అంటుకున్న భవనం పైఅంతస్థులో ఉన్న జిమ్‌ ఉంది. కింద లిఫ్ట్‌ వద్ద చెలరేగిన మంటలు పైన ఉన్న జిమ్‌ వరకు వెళ్లిపోయాయి. అప్పటికే జిమ్‌లో పది మంది వర్కవుట్స్‌ చేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు, పొగ చెలరేగడంతో అందులో చిక్కుకున్నారు. సెంటర్‌ చుట్టూ పొగలు కమ్మేయడంతో భయాందోళనలకు గురయ్యారు. ఆ సమయంలో జిమ్‌లో ఉన్న ఎస్‌.సురేశ్‌, వై.దినేష్‌లు భయపడకుండా భవనం నుంచి బయటపడే ఆలోచన చేశారు. అదే సమయానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. జిమ్‌ సెంటర్‌లో ఇరుక్కున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది బిల్డింగ్‌ వెనుక నుంచి పైకి వెళ్లారు. అప్పటికే సురేష్‌, దినేష్‌లు సీలింగ్‌ రేకులు విరగ్గొట్టి అందులో నుంచి జిమ్‌లో ఇరుక్కున్న వారిని పైకి చేరవేశారు. వాళ్లని ఫైర్‌ సిబ్బంది వెళ్లి కిందకు దింపడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:56 AM