Share News

వంట గ్యాస్‌ లీక్‌తో మంటలు

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:40 AM

మండలంలోని గొల్లలపాలెం శివారు తమ్మయ్యపాలెం గ్రామంలోని ఒక ఇంటిలో వంట గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించడంతో సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఇందులో నాలుగు లక్షల రూపాయల నగదు, నాలుగు తులాల బంగారం వుంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఈ సంఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

వంట గ్యాస్‌ లీక్‌తో మంటలు
వంట గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించడంతో కాలిపోయిన వస్తువులు, నగదు భద్రపరిచిన పెట్టె

రూ.4 లక్షల నగదు, 4 తులాల బంగారం దగ్ధం

ఇంటిలో వస్తువులు సైతం కాలి బూడిద..

రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్టు అంచనా

సబ్బవరం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గొల్లలపాలెం శివారు తమ్మయ్యపాలెం గ్రామంలోని ఒక ఇంటిలో వంట గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించడంతో సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఇందులో నాలుగు లక్షల రూపాయల నగదు, నాలుగు తులాల బంగారం వుంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఈ సంఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

తమ్మయ్యపాలెం గ్రామానికి చెందిన జోగ కోటేశ్వరరావు, పైడమ్మ దంపతులు, వ్యవసాయంతోపాటు గాజువాకలో కూరగాయల వ్యాపారం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. కుమారుడు, కోడలు కింద ఇంటిలో, కోటేశ్వరరావు, పైడమ్మ ఇంటి మేడపై రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు. గురువారం తెల్లవారుజామున టీ కాచేందుకు పైడమ్మ గ్యాస్‌ స్టౌ వెలిగించింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భయంతో పరుగులు తీసింది. కింద ఇంటిలో వున్న కుమారుడు, కోడలిని నిద్రలేపి గ్యాస్‌ లీక్‌ ప్రమాదం గురించి చెప్పింది. వారు మేడపైకి వెళ్లి చూడగా.. ఇంటిలో వస్తువులు కాలిపోతున్నాయి. గ్యాస్‌ సిలిండర్‌ పేలే ప్రమాదం వుండడంతో ఇంటిలోకి వెళ్లేందుకు సాహసించలేదు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అనంతరం లోపలికి వెళ్లి చూడగా ఇంటిలో భద్రపరిచిన రూ.4 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం (గొలుసు, చెవి దుద్దులు)తోపాటు 20 బస్తాల ధాన్యం, 10 కోళ్లు, బస్తా బొబ్బర్లు, 120 కిలోల ఉలవలు, 30 కిలోల మినుములు, రెండు ఫ్యాన్లు, దుస్తులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు కాలిపోయాయి. మనవరాలికి (కుమార్తె కూతురు) సారె కోసం బ్యాంకు నుంచి తెచ్చి, ట్రంకు పెట్టెలో భద్రపరిచిన నగదుతోపాటు నాలుగు తులాల బంగారంం కాలిపోయిందని బాధితులు వాపోయారు. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. తహశీల్దార్‌ బి.చిన్నికృష్ణ గ్రామానికి వెళ్లి ప్రమాదం గురించి తెలుసుకున్నారు. 25 కిలోల బియ్యం, దుప్పట్లు అందజేశారు. కలెక్టర్‌కు నివేదిక పంపిస్తానని, ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని చెప్పారు.

Updated Date - Jun 27 , 2025 | 12:40 AM