రోడ్డుపై చెత్త వేస్తే రూ.వెయ్యి జరిమానా
ABN , Publish Date - Oct 24 , 2025 | 01:06 AM
నగరంలో ప్రజలు, వ్యాపారులు చెత్తను రోడ్లపై, గెడ్డల్లో పడేయకుండా చూడాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ నిర్ణయించారు.
గెడ్డల్లో కూడా వేయకూడదు
దుకాణాల వద్ద డస్ట్ బిన్‌లు ఏర్పాటుచేయని వ్యాపారులకు కూడా...
డ్రోన్‌ల ద్వారా రోడ్లపై ఉండే చెత్తగుర్తింపు
తక్షణం తొలగించేలా సంబంధిత పారిశుధ్య సిబ్బందికి సమాచారం
వన్‌టౌన్ నుంచి శ్రీకారం చుట్టిన జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో ప్రజలు, వ్యాపారులు చెత్తను రోడ్లపై, గెడ్డల్లో పడేయకుండా చూడాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ నిర్ణయించారు. ఇందుకోసం డ్రోన్‌ల సహాయం తీసుకోనున్నారు. బాధ్యత లేకుండా రోడ్లపై చెత్తను పడేసిన వారికి రూ.వెయ్యి జరిమానా విధించనున్నారు. దీనికోసం పూర్ణామార్కెట్ నుంచి టౌన్ కొత్తరోడ్డు వరకు బుధవారం రాత్రి డ్రోన్‌తో సర్వే నిర్వహించారు.
నగరంలో ఎక్కడచూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. కొందరు తమ ఇళ్లలోని చెత్తను తీసుకొచ్చి రోడ్లపై, గెడ్డల్లోనూ పడేస్తున్నారు. అలాగే వ్యాపారులు తమ దుకాణాల ముందు డస్ట్ బిన్‌లను పెట్టకపోవడంతో వినియోగదారులు చెత్తను రోడ్డుపైనే పడేసి వెళ్లిపోతున్నారు. దీనివల్ల రోడ్లన్నీ అపరిశుభ్రంగా మారుతున్నాయి. పారిశుధ్య సిబ్బంది ఎంతగా శ్రమించినాసరే ఆశించిన ఫలితం ఉండడం లేదు. దీంతో కమిషనర్ కేతన్‌గార్గ్ వినూత్నంగా ఆలోచించారు. జీవీఎంసీ పరిధిలో ఒక డ్రోన్ ఆపరేటర్‌ను తాత్కాలిక ప్రాతిపదికన విధుల్లోకి తీసుకున్నందున అతని సేవలను రోడ్లను పరిశుభ్రంగా మార్చేందుకు వాడుకోవాలని నిర్ణయించారు. కోర్ సిటీ ప్రాంతంలోని జోన్-3, జోన్-4, జోన్-5 పరిధిలో గల ప్రధానరోడ్లు, గెడ్డలపై డ్రోన్‌తో ప్రతిరోజూ నిఘా పెట్టడం, సర్వే నిర్వహించడం చేయాలని ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్‌కుమార్‌తోపాటు ఆయా జోన్ల కమిషనర్లను ఆదేశించారు. డ్రోన్‌ను ప్రధాన రోడ్లు, ప్రాంతాల్లో ఎగురవేసినప్పుడు వీడియో లింక్‌ను జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఇవ్వాలని సూచించారు. ఆ లింక్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని సిబ్బంది డ్రోన్ వెళ్లే మార్గంలో ఎక్కడెక్కడ చెత్త ఉందో గుర్తించి, ఆ ప్రాంత శానిటరీ ఇన్‌స్పెక్టర్, వార్డు శానిటరీ సెక్రటరీలతోపాటు జోన్ కమిషనర్, ఏఎంహెచ్‌ఓలకు సమాచారం అందిస్తారు. వారంతా ఆ మార్గంలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బంది ద్వారా రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించేలా చర్యలు తీసుకుంటారు. అలాగే డ్రోన్ వీడియోలో దుకాణాలు ముందు ఎక్కడైనా చెత్త కనిపిస్తే ఆ దుకాణ యజమానికి రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. అలాగే ఎవరైనా చెత్తను తమ ఇంటికి వచ్చే వాహనానికి అందజేయకుండా రోడ్డుపైగానీ, గెడ్డలోగానీ పడేస్తున్నట్టు డ్రోన్ వీడియోలో గుర్తిస్తే వారికి కూడా రూ.వెయ్యి జరిమానా విధించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ విధానంలో లోటుపాట్లను తెలుసుకునేందుకు బుధవారం రాత్రి పూర్ణామార్కెట్ నుంచి టౌన్‌కొత్తరోడ్డు జంక్షన్ వరకూ రోడ్డుపై డ్రోన్‌ను ఎగురవేశారు. స్వయంగా కమిషనర్ దీనిని పూర్ణామార్కెట్‌రోడ్డు నుంచి పర్యవేక్షించగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని సిబ్బంది డ్రోన్ వీడియోను విశ్లేషించి ఆ మార్గంలో చెత్త ఎక్కడెక్కడ ఉందనే సమాచారాన్ని సంబంధిత ప్రాంత శానిటరీ ఇన్‌స్పెక్టర్, జోనల్ కమిషనర్లకు వెంటవెంటనే పంపించారు. దీనివల్ల రోడ్లపై చెత్త కనిపించకుండా చేయవచ్చునని భావించిన కమిషనర్ ఇకపై నిరంతరం దీనిని కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై చెత్త పడేసే వారితోపాటు దుకాణాల వద్ద చెత్తను వేసేందుకు డస్ట్ బిన్‌లు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వ్యాపారులకు జరిమానా విధించే బాధ్యతను స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లకు అప్పగించారు. డ్రోన్ ఆపరేటర్ ప్రతిరోజూ ఏదో ఒక జోన్‌కు వెళ్లి ఆ జోన్‌లో ప్రధాన మార్గాలను వీడియో తీయాల్సి ఉంటుంది. దీని గురించి ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్ వద్ద ప్రస్తావించగా, రోడ్లను ఎంత శుభ్రం చేస్తున్నా ప్రజలు, వ్యాపారుల నిర్లక్ష్యం కారణంగా చెత్తమయంగా మారుతున్నాయని, దీనిని అరికట్టేందుకు కొత్త విధానం చాలావరకు సహాయపడుతుందని అన్నారు.