రైతులకు ఆర్థిక భరోసా!
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:19 AM
రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద నగదు సాయం అందించడానికి తుది ఏర్పాట్లు చేసింది. వచ్చే నెల రెండో తేదీన ‘పీఎం కిసాన్ యోజన’ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ెండు వేల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో ఐదు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.
రెండు తేదీన ‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు జమ
ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు..
రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్రం రూ.2 వేలు
ఈ నెలాఖరు నాటికి తుది జాబితా సిద్ధం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద నగదు సాయం అందించడానికి తుది ఏర్పాట్లు చేసింది. వచ్చే నెల రెండో తేదీన ‘పీఎం కిసాన్ యోజన’ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ెండు వేల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో ఐదు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.
ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వున్నప్పటికీ గత ఏడాది సాధారణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది. వీటిల్లో ఏటా ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు పథకాన్ని గత ఏడాదే ప్రారంభించింది. తల్లికి వందన కార్యక్రమం కింద ఒకటి నుంచి పదో తరగతివరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున అందించే కార్యక్రమానికి ప్రస్తుత విద్యా సంవత్సరంలో శ్రీకారంచుట్టింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. మరో ప్రధానమైన ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ఆగస్టు రెండో తేదీన ప్రారంభించనున్నది. పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.6 వేల రూపాయలు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14 వేలు కలిపి మొత్తం రూ.20 వేలు ఇవ్వనున్నది. కేంద్ర ప్రభుత్వం ఏడాదిలో మూడుసార్లు రూ.2 వేల చొప్పున ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఆగస్టు రెండో తేదీన రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ చేయనున్నది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద తన వాటాగా మొదటి దఫా రూ.5 వేలు ఇస్తున్నది. ఈ సొమ్మును కూడా ఆగస్టు రెండో తేదీన ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు చేపట్టింది. ఇందు కోసం ఈ నెలాఖరులోగా అర్హులను గుర్తించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని రాష్ట్ర అధికారులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. అన్నదాత సుఖీభవ పథకానికి జిల్లాలో ఇంతవరకు 2,41,637 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. వీరిలో 2,37,058 మంది ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. ఇంకా 2,499 మంది ఈకేవైసీ చేయాల్సి ఉంది. సరైన పత్రాలు సమర్పించని 2,089 మందిని పథకానికి అనర్హులుగా నిర్ధారించారు. కౌలు రైతులకు కార్డుల జారీ పూర్తయ్యాక రెండు విడతల నిధులను ప్రభుత్వం ఒకేసారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నది.
ఇదిలావుండగా పీఎం కిసాన్ యోజన కింద నవంబరు/ డిసెంబరులో రెండో విడత రూ.2 వేలు, వచ్చే ఏడాది ఫిబ్రవరి/ మార్చి నెలల్లో మూడో విడత రూ.2 వేల చొప్పున కేంద్రం ఇవ్వనున్నది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతలో రూ.7 వేలు, మూడో విడత రూ.6 వేలు చొప్పున ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నది.
అర్హులందరికీ పథకం వర్తింపు
బి.మోహన్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి
అన్నదాత సుఖీభవ పథకాన్ని అర్హులందరికీ వర్తించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 2,37,058 మంది రైతుల ఈకేవైసీ పూర్తయ్యింది. 2,089 మంది సరైన పత్రాలు సమర్పించకపోవడంతో ఈకేవైసీ పూర్తికాలేదు. మిగిలిన వారు ఈ నెలాఖరులోగా ఈకేవైసీ పూర్తి చేయించుకుంటే అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చే నెల రెండో తేదీన ఆర్థిక సాయం అందుతుంది.