Share News

డిగ్రీ విద్యార్థులకు ఆర్థిక పాఠాలు

ABN , Publish Date - Nov 10 , 2025 | 12:22 AM

విద్యార్థులకు ఆర్థిక అంశాలపై (పెట్టుబడి పెట్టే మార్గాల)పై అవగాహన కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి.

డిగ్రీ విద్యార్థులకు ఆర్థిక పాఠాలు

ఐఐఎంలో నిర్వహణకు సన్నాహాలు

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం

ఇప్పటికే ఉన్నత విద్యా మండలి, యాంఫీతో ఒప్పందం

ఏటా 20 వేల మందికి అందనున్న శిక్షణ

తొలి దశలో అధ్యాపకులకు వచ్చే నెల 13 నుంచి ప్రారంభం

విశాఖపట్నం, నవంబరు 9 (ఆంరధజ్యోతి):

విద్యార్థులకు ఆర్థిక అంశాలపై (పెట్టుబడి పెట్టే మార్గాల)పై అవగాహన కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇప్పటికే భారత్‌ అభివృద్ధి చెందిన ఆర్థిక దేశాల జాబితాలో కీలక స్థానానికి చేరుకుంది. అగ్రస్థానానికి చేరుకునే దిశగా నిర్ణయాలను తీసుకుంటోంది. ఆ స్థాయికి ఎదగాలంటే ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత (అవగాహన) అవసరమని నిపుణులు చెబుతున్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎంఎఫ్‌ఐ) నిర్ణయించాయి. ఈ మేరకు ఐఐఎంతో ఒప్పందం చేసుకున్నాయి.

భవిష్యత్తులో పెట్టుబడులుపెట్టే వర్గాలుగా మారనున్న విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు వీలుంటుందని ఏఎంఎఫ్‌ఐ భావించింది. ఈ నేపథ్యంలోనే దేశంలోనే తొలిసారిగా విద్యార్థులకు ఆర్థిక పాఠాలు బోధించేందుకు సిద్ధమైంది. విద్యార్థులకు శిక్షణ అందించేందుకు విశాఖలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)తో రాష్ట్ర ప్రభుత్వం, ఏఎంఎఫ్‌ఐ ఎంవోయూ చేసుకున్నాయి.

డిగ్రీ విద్యార్థులకు శిక్షణ..

అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (ఏఎంఎఫ్‌ఐ) దేశంలోని అన్ని సెబీ నమోదిత మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించిన లాభాపేక్ష లేని, స్వీయ నియంత్రణ కలిగిన సంస్థ. మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇండస్ర్టీని వృత్తిపరంగా, నైతికంగా అభివృద్ధిచేయడం, పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడడం, పారదర్శకతను ప్రోత్సహించడం దీని ప్రధాన కార్యకలాపాలు. ఈ సంస్థ ప్రధానంగా మ్యూచువల్‌ ఫండ్స్‌పై అవగాహన కల్పించేందుకు, పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంపొందించేందుకు కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈమేరకు సామాజిక మాధ్యమాలు, ఇతరమార్గాల ద్వారా అవగాహన కల్పిస్తోంది. అయితే, వీటివల్ల ఆశించినస్థాయిలో ఫలితాలు రావడం లేదని భావించిన సంస్థ ఇతర మార్గాలను అన్వేషించింది. ఈ క్రమంలో ప్రజలకు ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఆసక్తిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఆర్థిక అంశాలపై శిక్షణ అందిస్తే, భవిష్యత్తులో వారికి పెట్టుబడి పెట్టే మార్గాలపై స్పష్టమైన అవగాహన కలుగుతుందని అంచనా వేసింది.

ఈ అంశాలపై..

ఫైనాన్షియల్‌ లిటరీ ప్రొగ్రామ్‌ ఫర్‌ డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్‌ పేరుతో కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. శిక్షణలో భాగంగా తొలిదశలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల నుంచి ఇద్దరు చొప్పున అధ్యాపకులను ఎంపిక చేసి ఐఐఎంలో శిక్షణ ఇస్తారు. దీనిని ట్రైన్‌ ద ట్రైనర్‌ మాడ్యుల్‌లో నిర్వహించనున్నారు. వీరిద్వారా కాలేజీల్లోని విద్యార్థులకు శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణ రెండు దశల్లో ఉంటుంది. మొదటిదశలో ఆర్థికఅంశాలపై శిక్షణ ఇచ్చి, అనంతరం పరీక్ష నిర్వహిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను ఐఐఎం పర్యవేక్షిస్తుంది. ఇందులో భాగంగా మార్కెట్‌ ఫంక్షనింగ్‌, రిస్క్‌, రిటర్న్‌ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రధానంగా స్టాక్‌మార్కెట్‌, బాండ్‌ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఫారెన్‌ ఎక్స్చేంజ్‌, క్రిప్టో కరెన్సీపై అవగాహన కల్పిస్తారు. దీనివల్ల పెట్టుబడులు పెట్టడం, లాభాలను ఆర్జించడంలో మెలకువలు తెలుస్తాయని ఏఎంఎఫ్‌ఐ భావిస్తోంది. తద్వారా భవిష్యత్తులో మనదేశం బలమైన ఆర్థికవ్యవస్థగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వచ్చే నెల 13 నుంచి అధ్యాపకులకు శిక్షణ ప్రారంభిస్తామని ఐఐఎం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. దీనివల్ల సురక్షితమైన పెట్టుబడులు పెట్టే మార్గాలు తెలుస్తాయని ఫైనాన్షియల్‌ లిటరీ ప్రొగ్రామ్‌ ఫర్‌ డిగ్రీ కాలేజీ స్టూడెంట్‌ ప్రొగ్రామ్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ విజయభాస్కర్‌ మారిశెట్టి తెలిపారు. ఏటా20వేల మంది విద్యార్థులకు శిక్షణ అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు.

Updated Date - Nov 10 , 2025 | 12:22 AM