Share News

ఎట్టకేలకు లింగాపురం రహదారికి మోక్షం

ABN , Publish Date - Jul 27 , 2025 | 12:52 AM

పురపాలక సంఘం పరిధిలోని లింగాపురం గ్రామస్థుల కల ఎట్టకేలకు నెరవేరింది. ఏళ్ల తరబడి వేధిస్తున్న రహదారి సమస్యకు పరిష్కారం దొరికింది. దీంతో పాటు కంపోస్ట్‌ యార్డుకు మార్గం సుగమమైంది.

    ఎట్టకేలకు లింగాపురం రహదారికి  మోక్షం
లింగాపురం వంతెనకు అప్రోచ్‌ రోడ్డు నిర్మిస్తున్న దృశ్యం

- దశాబ్దాల కాలంగా ఉన్న రోడ్డు సమస్యకు పరిష్కారం

- అప్రోచ్‌ రోడ్డు నిర్మాణానికి రూ.27 లక్షల నిధులు మంజూరు

- శరవేగంగా బీటీ రోడ్డు నిర్మాణ పనులు

నర్సీపట్నం, జూలై 26(ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘం పరిధిలోని లింగాపురం గ్రామస్థుల కల ఎట్టకేలకు నెరవేరింది. ఏళ్ల తరబడి వేధిస్తున్న రహదారి సమస్యకు పరిష్కారం దొరికింది. దీంతో పాటు కంపోస్ట్‌ యార్డుకు మార్గం సుగమమైంది.

గిరిజన గ్రామం లింగాపురం 20వ వార్డు పరిధిలోకి వస్తుంది. గ్రామంలో 460 గిరిజనులు నివసిస్తున్నారు. గ్రామస్థులు నర్సీపట్నం రావాలంటే వరహానది దాటుకొని రాకపోకలు సాగించాల్సి వచ్చేది. వర్షా కాలంలో వరహానది ఉధృతంగా ప్రవహించడం వలన ఇక్కడి ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి తీవ్ర ఇబ్బందులు పడేవారు. రోగులు, గర్భిణులను ఏరియా ఆస్పత్రికి తరలించాలంటే 108 అంబులెన్స్‌లు గ్రామంలోకి వచ్చే పరిస్థితి లేదు. దీంతో వారిని డోలీ సహాయంతో నదిలో నడుం లోతు నీళ్లలోంచి అతి కష్టం మీద ఆస్పత్రికి తరలించాల్సి వచ్చేది. విద్యార్థులు ఉన్నత పాఠశాల, కళాశాల చదువులకు వరహానది లోంచి నర్సీపట్నం, బలిఘట్టం రాకపోకలు సాగించే వారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఏఎన్‌ఎంలు లింగాపురం నుంచి నర్సీపట్నం రాకపోకలు సాగించడానికి అవస్థలు పడేవారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ఆర్‌అండ్‌బీ శాఖా మంత్రి అయ్యన్నపాత్రుడు చొరవతో రూ.3 కోట్లతో వరహానదిపై వంతెన నిర్మించారు. దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం దొరికిందని అందరూ ఆనందించారు. అయితే భూ సేకరణ సమస్య కారణంగా అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం జరగలేదు. దీంతో వంతెన ఉన్నా గ్రామస్థులకు ప్రయోజనం చేకూరలేదు. అలాగే పురపాలక సంఘం పారిశుధ్య విభాగం సిబ్బంది సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌(కంపోస్ట్‌ యార్డు)కి చెత్తను తరలించడానికి ఇబ్బందులు పడేవారు. చెత్త రవాణా ట్రాక్టర్లు వరహానది లోంచి రాకపోకలు సాగించాల్సి వచ్చేది. టీడీపీ కౌన్సిలర్‌ రామరాజు అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం గురించి కౌన్సిల్‌ సమావేశంలో పలుమార్లు ప్రస్తావించి నిరసన తెలిపేవారు. ఒక పర్యాయం చెప్పుతో చెంపలపై కొట్టుకొని నిరసన తెలపడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం రహదారి నిర్మాణానికి అవసరమైన 15 సెంట్ల భూమిని రూ.10.50 లక్షలతో ప్రైవేటు వ్యక్తి నుంచి కొనుగోలు చేసింది. తాజాగా పురపాలక సంఘం 15వ ఆర్థిక సంఘం నిధులు నుంచి రూ.27 లక్షలతో 280 మీటర్లు బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. దీంతో దీంతో లింగాపురం గ్రామస్థులకు రోడ్డు సమస్య పరిష్కారం కావడంతో పాటు సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌కి చెత్త తరలించడానికి మార్గం సుగమమైంది.

Updated Date - Jul 27 , 2025 | 12:52 AM