ఫిల్మ్ క్లబ్ పరువు పాయె
ABN , Publish Date - Apr 10 , 2025 | 01:07 AM
వైజాగ్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ పరువు గంగలో కలిసిపోయింది. వైసీపీ నేతలు కార్యవర్గంలో ప్రవేశించిన తరువాత క్లబ్ స్థాయి పడిపోయింది. కమీషన్ల వ్యవహారం ఎక్కువైపోయింది.

ఇటీవల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్
కార్యవర్గ సభ్యుల సమక్షంలో
నామినేషన్లు ఉన్న బాక్స్‌ను
ఓపెన్ చేసిన ఉద్యోగి
సోషల్ మీడియాలో వైరల్
...ఈ పరిణామాల నేపథ్యంలో
వ్యక్తిగత కారణాల వల్ల ఎన్నికల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు
సీనియర్ న్యాయవాది ప్రకటన
ఎన్నికల ప్రక్రియ రద్దు చేస్తున్నట్టు
గౌరవ కార్యదర్శి ప్రకటన
విశాఖపట్నం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి):
వైజాగ్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ పరువు గంగలో కలిసిపోయింది. వైసీపీ నేతలు కార్యవర్గంలో ప్రవేశించిన తరువాత క్లబ్ స్థాయి పడిపోయింది. కమీషన్ల వ్యవహారం ఎక్కువైపోయింది.
క్లబ్ అధ్యక్షుడు కాయల వెంకటరెడ్డి, కోశాధికారి గోపీనాథ్‌రెడ్డి పదవులకు రాజీనామా చేసి నెలలు గడిచినా వాటిని ఆమోదించకుండా రాజకీయం చేశారు. ఎట్టకేలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. నామినేషన్లు స్వీకరించారు. అయితే కార్యవర్గ సభ్యుల సమక్షంలోనే ఒకరు నామినేషన్ల బాక్స్ ఓపెన్ చేసిన వీడియో బయటకు వచ్చింది. దానిని కూడా సదరు వ్యక్తులు సమర్థించుకుంటూ మంగళవారం పోటీదారులకు లేఖ రాశారు. నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా చేశామని, ఎవరి నామినేషన్లు వారు చెక్ చేసుకోవాలని, ఎలాంటి మార్పులు చేయలేదని సురేందర్‌రెడ్డి లేఖలు రాశారు. 24 గంటలు గడవక ముందే ఈ ఎన్నికలకు అధికారిగా వ్యవహరించిన సీనియర్ న్యాయవాది కె.నరసింహమూర్తి వ్యక్తిగత కారణాల వల్ల తాను ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని గౌరవ కార్యదర్శి శ్రీనివాసరాజు బుధవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియ వివాదాస్పదంగా మారిందని, అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అందువల్ల ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తరువాత కొత్తగా ఎన్నికల తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు. విశాఖపట్నంలో ప్రముఖులు సభ్యులుగా ఉన్న ఒక క్లబ్‌పై ఈ స్థాయిలో విమర్శలు రావడం ఇదే తొలిసారి. ఇప్పటికీ దీనిని తమ గుప్పిట్లో ఉంచుకోవాలని వైసీపీ నేతలు యత్నించడం, వారికి తెర వెనుక కూటమి నాయకులు సహకరించడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఈ క్లబ్‌లో వైసీపీ పెత్తనం పెరిగిపోయిందని ఆరోపించిన నాయకులు ఎవరూ ఇప్పుడు దీనిపై మాట్లాడకపోవడం గమనార్హం.
ఎన్నికల ప్రక్రియలో అవకతవకలపై వీడియో ఫుటేజీ ఉంది. దానిని పోలీసులకు ఇచ్చి విచారణ చేయిస్తే అందరి బాగోతం బయట పడుతుంది. కానీ కార్యవర్గం పెద్దలు ఆ పని చేయడం లేదు. ఇప్పటికే క్లబ్ పరువు పోయిందని, ఇంకా దిగజారిపోతుందని ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా ఒక్కరు కూడా ముందుకువచ్చి ఏమి జరిగిందో వెల్లడించకపోవడం గమనార్హం.