బెర్రీ బోరర్‌పై సమరం
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:03 AM
ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన మన్యం(అరకు) కాఫీ ప్రమాదంలో పడడంతో తోటలను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. పొరుగు రాష్ట్రాలకే పరిమితమైన కాఫీ బెర్రీ బోరర్ తెగులు గిరిజన రైతులు సాగుచేస్తున్న కాఫీ తోటలను ప్రప్రథమంగా ఆశించింది. ఈ తెగులును ప్రాథమిక దశలోనే అంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
మన్యానికి కదిలొచ్చిన అధికార యంత్రాంగం
కాఫీ తోటల్లో క్షుణ్ణంగా గాలిస్తున్న అగ్రి కల్చర్ విద్యార్థులు, శాస్త్రవేత్తలు, అధికారులు
142.67 ఎకరాల్లో వ్యాప్తి చెందిన తెగులు
యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు
నష్టపోయిన రైతులకు పరిహారం
కిలోకి రూ.50, నిర్వహణ ఖర్చులు ఎకరానికి రూ.5 వేలు
విపత్తు సాయంగా అదనపు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు
చింతపల్లి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన మన్యం(అరకు) కాఫీ ప్రమాదంలో పడడంతో తోటలను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. పొరుగు రాష్ట్రాలకే పరిమితమైన కాఫీ బెర్రీ బోరర్ తెగులు గిరిజన రైతులు సాగుచేస్తున్న కాఫీ తోటలను ప్రప్రథమంగా ఆశించింది. ఈ తెగులును ప్రాథమిక దశలోనే అంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో రాష్ట్రం నలుమూలల నుంచి అధికార యంత్రాంగం గిరిజన ప్రాంతానికి కదిలొచ్చింది. కేంద్ర కాఫీ బోర్డు, ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ, ఉద్యాన విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు బృందాలుగా ఏర్పడి రైతుల కాఫీ తోటలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కాఫీ బెర్రీ బోరర్ వ్యాప్తి చెందినట్టు గుర్తిస్తే వెంటనే యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపడుతున్నారు. అరకులోయ మండల పరిధిలోని ఏడు గ్రామాల్లో 142.67 ఎకరాల్లో కాఫీ బెర్రీ బోరర్ వ్యాప్తి చెందినట్టు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. కాఫీ గింజలను నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందిస్తున్నది.
జిల్లాలో ఆదివాసీ రైతులు సంప్రదాయేతర పంటగా కాఫీని 2.58 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 1.8 లక్షల ఎకరాల నుంచి కాఫీ దిగుబడులు వస్తున్నాయి. ఆదివాసీ రైతులు కాఫీని సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. గిరిజన ప్రాంత వాతావరణం నాణ్యమైన కాఫీ ఉత్పత్తికి అనుకూలించింది. దీంతో గిరిజన రైతులు పండించిన కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీ రుచులను ఆస్వాదించేందుకు ఆసక్తి చూపే ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉన్నారంటే అతిశయోక్తికాదు. కాఫీ సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగును చేపట్టేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ తరుణంలో గిరిజన ప్రాంతంలో కాఫీ బెర్రీ బోరర్ తెగులు బయటపడింది. ఈ తెగులు ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. తొలిసారిగా గిరిజన ప్రాంతంలో కనిపించడంతో అధికార యంత్రాంగం, గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు.
పెరుగుతున్న విస్తీర్ణం
గిరిజన ప్రాంతంలో కాఫీ బెర్రీ బోరర్ తెగులు వ్యాప్తి చెందిన విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. గత నెలలో కేంద్ర కాఫీ బోర్డు అధికారులు తొలిసారిగా అరకులోయ మండలం చినలబుడు పంచాయతీ పకనకుడి గ్రామంలోని గిరిజన మహిళా రైతు సిరగం సువర్ణకు చెందిన ఎకరం కాఫీ తోటలో తెగులును గుర్తించారు. పకనకుడికి ఆనుకుని వున్న మాలివలస, మలసింగారం, చినలబుడు, తురాయ్‌గుడ, గరడగుడ, పెదలబుడు గ్రామాలను పరిశీలించగా సోమవారం నాటికి 137 మంది రైతులు సాగు చేస్తున్న 142.67 ఎకరాలతో పాటు చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో 1.25 ఎకరాల్లో కాఫీ బెర్రీ బోరర్ వ్యాప్తి చెందినట్టు అధికారులు గుర్తించారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
ప్రత్యేక బృందాలు గాలింపు
కాఫీ బెర్రీ బోరర్‌ను తొలిదశలోనే నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు గిరిజన ప్రాంతానికి అధికార యంత్రాంగాన్ని పంపించింది. ప్రస్తుతం కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా ఉద్యానశాఖాధికారి కంటా బాలకర్ణ, ఐటీడీఏ ప్రాజెక్టు ఉద్యానశాఖ అధికారి రాజశేఖర్, చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, శాస్త్రవేత్త చెట్టి బిందు, కేంద్ర కాఫీ బోర్డు సీనియర్ లైజలింగ్ అధికారి ఎస్.రమేశ్ నాయకత్వంలో ప్రత్యేక బృందాలు కాఫీ బెర్రీ బోరర్ తెగులు గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతానికి ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం, వెంకట రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి 15 మంది ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు వచ్చారు. అలాగే నైరా, బాపట్ల అగ్రికల్చర్ కళాశాల నుంచి 75 మంది విద్యార్థులు, వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల నుంచి 60 మంది విద్యార్థులు వచ్చారు. అలాగే ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు లైజన్ వర్కర్లు, కాఫీ బోర్డు ఉద్యోగులు 100 మందిని తెగులు నియంత్రణ విధులకు కేటాయించారు. ప్రస్తుతం అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు బృందాలుగా గిరిజన రైతులు సాగు చేస్తున్న తోటలను పరిశీలిస్తూ కాఫీ బెర్రీ బోరర్ తెగులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు 48,200 ఎకరాలను అధికార యంత్రాంగం సర్వే చేసింది.
యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు
కాఫీ బెర్రీ బోరర్ తెగులు గుర్తించిన తోటల్లో అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపడుతున్నది. చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో తెగులు వ్యాప్తి చెందిన 1.25 ఎకరాల్లో గింజలకు నివారణ చికిత్స చేసి పూర్తి స్థాయిలో భూమిలో పూడ్చివేశారు. అరకులోయలో మంగళవారం నాటికి తెగులు ఆశించిన 110 ఎకరాల్లో కాఫీ గింజలను తుంచివేసి నివారణ చర్యలు పూర్తి చేశారు.
రైతులకు పరిహారం
కాఫీ బెర్రీ బోరర్ తెగులు వలన పంటను నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందజేస్తున్నది. కిలో కాఫీకి రూ.50 చెల్లించడంతో పాటు నివారణ చర్యలు చేపట్టేందుకు ఎకరాకు రూ.5 వేలు చెల్లిస్తుంది. రైతులకు చెల్లించే పరిహారం పెంచేందుకు విపత్తుల నిర్వహణ నుంచి అదనపు నిధులు కేటాయించాలని ఉద్యానశాఖ, పట్టు పరిశ్రమ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు ప్రభుత్వానికి లేఖ రాశారు. పరిహారం పెంచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది. అలాగే గిరిజన ప్రాంతంలో కాఫీ బెర్రీ బోరర్ తెగులు గుర్తింపు సర్వే, నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక నిధులను మంజూరు చేసింది.