యూరియా కోసం తోపులాట
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:56 AM
పొట్ట దశకు వచ్చిన వరి పంటకు చివరి విడత యూరియా వేయాల్సి రావడంతో రైతులు రైతు సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే), పీఏసీఎస్‌ల వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
వరి పంటకు చివరి విడత ఎరువు వేయడానికి సమయం ఆసన్నం
ఆర్‌ఎస్‌కేలకు భారీగా తరలివచ్చిన రైతులు
యూరియా అందదేమోనని ఆతృత
ఒక్కో రైతుకు బస్తా మాత్రమే పంపిణీ
ఎలమంచిలి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి):
పొట్ట దశకు వచ్చిన వరి పంటకు చివరి విడత యూరియా వేయాల్సి రావడంతో రైతులు రైతు సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే), పీఏసీఎస్‌ల వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మండలంలో ఎలమంచిలి, షేకిళ్లపాలెం, కట్టుపాలెం, సోమలింగపాలెం, పోతిరెడ్డిపాలెం, పులపర్తి గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో ఎరువుల పంపిణీ జరుగుతున్నట్టు తెలుసుకున్న రైతులు ఉదయాన్నే ఆయా కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎలమంచిలి వ్యవసాయ శాఖ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావడంతో తోపులాట చోటుచేసుకుంది. క్యూ పద్ధతి పాటించకపోవడంతో ఒకరినొకరు తోసుకునే పరిస్థితి ఎదురైంది. పేర్లు నమోదు చేసుకునేచోట కూడా రైతులు ఎగబడ్డారు. ఎలమంచిలి, పులపర్తి కేంద్రాలకు అధిక సంఖ్యలో రైతులు తరలివచ్చారు. అయితే రైతుకు ఉన్న పొలం విస్తీర్ణం ఎంత వున్నప్పటికీ ఒక్కో రైతుకు ఒక బస్తా మాత్రమే యూరియా ఇస్తుండడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వరి పైరు పొట్ట దశకు చేరిందని, ఈసమయంలో సరిపడ యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు ఒక బస్తా చొప్పున యూరియా అందజేయాలని కోరుతున్నారు.
మునగపాకలో...
మునగపాక, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): యూరియా కోసం సోమవారం రైతు సేవా కేంద్రానికి రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఖరీఫ్‌లో చివరి విడత యూరియా పంపిణీపై అధికారులు ముందుగానేన సమాచారం ఇవ్వడంతో ఉదయం ఏడు గంటలకే పలువురు రైతులు వచ్చారు. మొత్తం 220 బస్తాల యూరియా మాత్రమే రాగా, రైతులు రెట్టింపు సంఖ్యలో వున్నారు. దీంతో తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి, రైతులను క్యూ లైన్లలో నిల్చోబెట్టారు. ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున 130 మందికి యూరియా అందజేశారు. మిగిలిన రైతులకు టోకెన్లు ఇచ్చి, మంగళవారం రావాలని చెప్పినట్టు ఏఈవో పద్మిని, రైతు సేవా కేంద్రం ఉద్యోగి లలిత తెలిపారు.