ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడండి
ABN , Publish Date - Jun 21 , 2025 | 01:13 AM
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కేత్రస్థాయిలో పోరాటాలు చేయడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.
నాయకులు, కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపు
విశాఖపట్నం, జూన్ 20 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కేత్రస్థాయిలో పోరాటాలు చేయడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. శుక్రవారం నగర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ నాయకులు సమష్టిగా పనిచేయాలని సూచించారు. జిల్లాలో పార్టీ తీరు ఆశాజనకంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల నుంచి ఆమె పార్టీ బలోపేతానికి సంబంధించి సూచనలు స్వీకరించారు. సమావేశంలో ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు, నాయకులు గాదం మహేష్, సత్యారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ మార్టిన్ లూధర్, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకర్‌రావు, స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ పినమల శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.
పద్మనాభంలో మట్టి మాఫియా
రాత్రి సమయంలో గ్రావెల్ తవ్వకం
లారీలతో ఇతర ప్రాంతాలకు తరలింపు
కూటమి నేత దందా
విశాఖపట్నం, జూన్ 20 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో మట్టి/గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అడ్డులేకుండా పోతోంది. అక్రమార్కులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములు, కొండలను తొలిచేసి జేబులు నింపుకుంటున్నారు. తాజాగా పద్మనాభం మండలం కృష్ణాపురంలో కూటమిలోని ఒక పార్టీకి చెందిన ఓ నేత ప్రభుత్వ భూమిలో గ్రావెల్/మట్టిని దర్జాగా తవ్వి రాత్రి సమయాల్లో భీమిలి, ఆనందపురం తదితర ప్రాంతాలకు లారీల్లో తరలిస్తున్నారు.
మండలంలోని కృష్ణాపురం సర్వే నంబరు-1లో ఇటీవల శంకుస్థాపన చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కుకు సమీపంలో కొండకు ఆనుకుని ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ అధికంగా గ్రావెల్ ఉండడంతో దానిని కొట్టేయడానికి కూటమి పార్టీకి చెందిన ఓ నేత పక్కా స్కెచ్ వేశారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం యోగాంధ్ర వేడుకల్లో నిమగ్నమై ఉండడం...ఆయనకు కలిసివచ్చింది. దీంతో గత ఐదారు రోజులుగా యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. సుమారు పది టిప్పర్లు/లారీలతో రాత్రిపూట గ్రావెల్ తరలిస్తున్నారు. చీకటిపడిన తరువాత తవ్వకాలు ప్రారంభించి మరుసటిరోజు తెల్లవారుజాము వరకు రోజుకు సుమారు 200 ట్రిప్పుల గ్రావెల్‌ను తరలించేస్తున్నారు. ఇప్పటివరకూ వెయ్యి లారీల గ్రావెల్ రవాణా జరిగిపోయిందని స్థానికులు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. స్థానికులు ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతనంటూ బెదిరిస్తున్నారని, అధికారులు తక్షణమే స్పందించి గ్రావెల్ అక్రమ తవ్వకాలను నిలుపుదల చేయాలని కోరుతున్నారు.