గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు తీవ్ర పోటీ
ABN , Publish Date - Aug 05 , 2025 | 01:10 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి చేపట్టిన ఇంటర్వ్యూలు సోమవారంతో ముగిశాయి.
ముగిసిన ఇంటర్వ్యూలు
ఎంపికైన అభ్యర్థులకు రెండు రోజుల్లో సమాచారం
రిటైర్డ్ ఫ్యాకల్టీ, సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు దరఖాస్తు
విశాఖపట్నం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి చేపట్టిన ఇంటర్వ్యూలు సోమవారంతో ముగిశాయి. ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్ కాలేజీ పరిధిలోని వివిధ విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి గత నెల నోటిఫికేషన్ ఇవ్వగా, సుమారు 1,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 1,250 మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. వారికి గడిచిన నాలుగు రోజుల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ వస్తున్నారు. సోమవారం రాత్రి 9 గంటలకు ఆ ప్రక్రియను ముగించారు. ఎంపికైన అభ్యర్థులకు రెండు రోజుల్లో సమాచారాన్ని అందించనున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఆన్‌లైన్‌లో నోటిఫికేషన్ ఇవ్వడంతో రాష్ట్రానికి చెందినవారే కాకుండా హైదరాబాద్ వంటి ప్రాంతాలకు చెందినవారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీగా ఎంపికైన అభ్యర్థులు వారానికి మూడు నుంచి నాలుగు తరగతులు బోధించాల్సి ఉంటుంది. అందుకుగాను ఆరు నెలలకు రూ.45 వేలు చొప్పున చెల్లించనున్నారు. ఈ పోస్టులకు పూర్తిస్థాయిలో సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేకపోవడంతో అనేక రంగాలకు చెందినవారు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే వర్సిటీలోని వివిధ విభాగాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన అధ్యాపకులు కూడా ఉన్నారు. ఇలా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఆరుగురు వరకు ఇంటర్వ్యూలకు హాజరైనట్టు తెలిసింది. అలాగే, గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేస్తూ పీహెచ్‌డీ అర్హత ఉన్న కొందరు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలోని ఽహైదరాబాద్ ప్రాంతానికి చెందినవారు కూడా పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. అయితే, రిటైర్డ్ ఉద్యోగులు, సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది, తెలంగాణకు చెందిన వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారిని, ఇతర ఉద్యోగాలు చేస్తున్న వారిని ఇంటర్వ్యూలకు పిలవడం దారుణమంటున్నారు. దీనిపై అధికారులు మాత్రం స్పందించడం లేదు.