సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పర్యటించాలి
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:30 PM
పీజీఆర్‌ఎస్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిలో ప్రజలు ఇచ్చే అర్జీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు.
అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
పీజీఆర్‌ఎస్‌లో 213 అర్జీలు స్వీకరణ
అనకాపల్లి కలెక్టరేట్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిలో ప్రజలు ఇచ్చే అర్జీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఆమెతోపాటు జేసీ ఎం.జాహ్నవి, ఎస్‌డీసీ ఎస్.సుబ్బలక్ష్మి, హౌసింగ్ పీడీ శ్రీనివాసులు.. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీలపై వెంటనే సంబంధిత అధికారుల నుంచి వివరాలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య గురించి అర్జీదారులతో స్వయంగా మాట్లాడాలని, ఒకే సమస్యపై పదే పదే ప్రజలు అర్జీలు ఇవ్వకుండా అధికారులు దృష్టి కేంద్రీకరించాలన్నారు. కాగా పీజీఆర్‌ఎస్‌లో వివిధ సమస్యలపై 213 అర్జీలు అందాయని కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, డీపీవో ఈ.సందీప్, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.హైమావతి, ఎక్సైజ్ అధికారి వి.సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో...
అనకాపల్లి రూరల్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఏఎస్పీ ఎల్.మోహనరావు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను ఆలకించారు. మొత్తం 35 అర్జీలు అందగా.. అనంతరం వాటిని సంబంధిత అధికారులకు బదలాయించారు.