Share News

ఫీవర్‌ సర్వే షురూ!

ABN , Publish Date - Nov 03 , 2025 | 01:00 AM

మొంథా తుఫాన్‌ తరువాత జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఫీవర్‌ సర్వే షురూ!

తుఫాన్‌ నేపథ్యంలో చేపట్టాలని ప్రభుత్వ ఆదేశం

ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్న ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త

హెల్త్‌ యాప్‌లో వివరాల నమోదు

ఐదు కేసులు ఉంటే అలర్ట్‌

ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు

విశాఖపట్నం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి):

మొంథా తుఫాన్‌ తరువాత జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుగానే జ్వరాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించేలా ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఫీవర్‌ సర్వేను చేపట్టింది. ఈ నెల 31 నుంచి ఆరోగ్యశాఖకు చెందిన ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎం ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు.

సర్వేలో భాగంగా తమ పరిఽధిలోని ఇళ్లకు వెళ్లి జ్వరాల కు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. జ్వర లక్షణాలుంటే హెల్త్‌ యాప్‌లోని సిండ్రోమిక్‌ ఫామ్‌లో వివరాలను ఏఎన్‌ఎం అప్‌లోడ్‌ చేస్తారు. ఒకే ప్రాంతం నుంచి ఐదు జ్వరాల కేసులు నమోదైతే రాష్ట్రస్థాయి ఆరోగ్యశాఖ అధికారులకు, స్థానిక మెడికల్‌ ఆఫీసర్‌కు సమాచారం అందుతుంది. ఆయా ప్రాంతాల్లో తప్పనిసరిగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లా అధికారుల నుంచి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులకు ఆదేశాలందాయి. ఆరోగ్య కేంద్రాలకు జ్వరాలతో వచ్చే రోగుల వివరాలను పీ ఫామ్‌, ఎల్‌ ఫామ్‌లో నమోదు చేస్తారు.

త్వరితగతిన గుర్తించేందుకు..

గతంలో తుపాన్లు తరువాత పలురకాల వ్యాధులు ప్రబలని సంఘటనలున్నాయి. ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందుగానే సర్వే చేపట్టి జ్వర బాధితులను గుర్తించేందుకు సన్నద్ధమైంది. జ్వరాలు న ఆయా ప్రాంతాల్లో ఫాగింగ్‌, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి జ్వరాలు వ్యాప్తి చెందకుండా కట్టడి చేయ నున్నారు. సర్వేకు వచ్చే ఆరోగ్యశాఖ సిబ్బందికి ప్రజలు సహకరించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు కోరారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సమాచారాన్ని తప్పనిసరిగా వెల్లడించాలన్నారు.

Updated Date - Nov 03 , 2025 | 01:00 AM