పాలమామిడిలో జ్వరాల విజృంభణ
ABN , Publish Date - Jul 19 , 2025 | 12:46 AM
మండలంలోని అంజలి శనివారం పంచాయతీ పాలమామిడి గ్రామంలో జ్వరాలు విజృంభించాయి. గ్రామంలో జ్వరంతో బాధపడుతుతూ ఒక బాలిక మృతి చెందగా.. మరో పది మంది వైద్యం కోసం నిరీక్షిస్తున్నారు. గ్రామానికి రహదారి సదుపాయం లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆస్పత్రికి తరలించలేని దుస్థితిని స్థానికులు ఎదుర్కొంటున్నారు.
బాలిక మృతి, 10 మందికి అస్వస్థత
రోడ్డు సౌకర్యం లేక ఆస్పత్రికి తరలించలేని దుస్థితి
ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వినతి
చింతపల్లి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అంజలి శనివారం పంచాయతీ పాలమామిడి గ్రామంలో జ్వరాలు విజృంభించాయి. గ్రామంలో జ్వరంతో బాధపడుతుతూ ఒక బాలిక మృతి చెందగా.. మరో పది మంది వైద్యం కోసం నిరీక్షిస్తున్నారు. గ్రామానికి రహదారి సదుపాయం లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆస్పత్రికి తరలించలేని దుస్థితిని స్థానికులు ఎదుర్కొంటున్నారు. పాలమామిడి గ్రామంలో వారం రోజుల క్రితం జ్వరాలు ప్రబలాయి. జ్వర బాధితులను తాజంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చి చికిత్స చేయించారు.
అయితే గ్రామంలో జ్వరాలు అదుపులోకి రాలేదు. గ్రామానికి చెందిన గెమ్మెలి ఝాన్సీ (12) ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతూ శుక్రవారం ఉదయం మరణించింది. బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నది. బాలిక మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా గ్రామంలో ఇంటికి ఒకరూ, ఇద్దరు జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేసి జ్వర బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనుంజయ్ కోరారు. మృతి చెందిన బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.