జాజులబందలో జ్వరాల విజృంభణ
ABN , Publish Date - May 20 , 2025 | 11:21 PM
మండలంలోని జాజులబంద (కొండశింగవరం) గ్రామంలో జ్వరాలు విజృంభించాయి. వారం రోజులుగా బాలబాలికలు జ్వరాలతో అల్లాడిపోతున్నారు.
ఏడేళ్ల బాలిక మృతి
పది మంది పిల్లల పరిస్థితి ఆందోళనకరం
జాడలేని వైద్య సిబ్బంది
కొయ్యూరు, మే 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జాజులబంద (కొండశింగవరం) గ్రామంలో జ్వరాలు విజృంభించాయి. వారం రోజులుగా బాలబాలికలు జ్వరాలతో అల్లాడిపోతున్నారు. అయినా వైద్య సిబ్బంది గ్రామం వైపు కన్నెత్తి చూడకపోవడంతో మంగళవారం ఉదయం పాంగి ఎస్తేరు(7) జ్వరంతో బాధపడుతూ మృతి చెందింది. గ్రామంలో మరో పది మంది బాలబాలికల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని స్థానిక గిరిజనులు తెలిపారు. జాజులబంద గ్రామంలో వారం రోజుల క్రితం బాలబాలికలకు జ్వరాలు ప్రబలాయి. ప్రస్తుతం ప్రతి ఇంటిలోనూ జ్వర బాధితులు వున్నారు. పాంగి ఎస్తేరు వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ సకాలంలో వైద్యం అందక మృతి చెందింది. ప్రస్తుతం గ్రామంలో పదేళ్లలోపు బాలబాలికలు జీవ, కుర్ర ప్రమీల, మర్రి కరుణ, మర్రి దేవతోపాటు మరో ఆరుగురు జ్వరాలతో బాధపడుతున్నారు. అలాగే ఓ వృద్ధుడు జ్వరంతో బాధపడుతున్నాడు. గ్రామంలో గిరిజనులు నేటికి ఊటగెడ్డ నీరు తాగాల్సివస్తున్నది. దీంతో జ్వరాలు అదుపులోకి రావడంలేదు. గ్రామానికి రహదారి లేకపోవడంతో 30 కిలోమీటర్ల దూరంలోఉన్న డౌనూరు పీహెచ్‌సీకి రోగులను డోలిపై తీసుకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికైన జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది స్పందించి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసి బాలబాలికలకు మెరుగైన వైద్యం అందించాలని స్థానిక గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వైద్య శిబిరం ఏర్పాటు
జాజులబంద గ్రామంలో జ్వరంతో బాలిక మృతి చెందిన విషయం తెలియడంతో డౌనూరు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ మళ్ల లలిత మంగళవారం మధ్యాహ్నం గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో 60 మందికి వైద్య పరీక్షలు జరిపారు. జ్వర బాధితుల రక్త నమూనాలను నిర్వహించారు. అవసరమైన మందులను పంపిణీ చేశారు.