పాడేరులో పండుగ
ABN , Publish Date - May 11 , 2025 | 12:57 AM
మన్యంవాసుల ఆరాధ్య దేవత పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ, ఐటీడీఏ యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మోదకొండమ్మను దర్శించుకునేందుకు మారుమూల గిరిజన పల్లెలతోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలి రానున్నారు.
నేటి నుంచి మోదకొండమ్మ ఉత్సవాలు
మూడు రోజుల పాటు నిర్వహణకు భారీ ఏర్పాట్లు
నేడు శతకంపట్టులో కొలువుదీరనున్న అమ్మవారు
ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలతో భారీ ఊరేగింపు
స్టాళ్లను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ శాఖలు
సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు
900 మందితో పోలీసు భారీ బందోబస్తు
విద్యుద్దీపాల అలంకరణతో ధగధగలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంవాసుల ఆరాధ్య దేవత పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ, ఐటీడీఏ యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మోదకొండమ్మను దర్శించుకునేందుకు మారుమూల గిరిజన పల్లెలతోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలి రానున్నారు.
మోదకొండమ్మను అత్తవారి ఇంటి నుంచి పుట్టింటికి తీసుకువచ్చే తంతుతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. స్థానిక ఆలయం(అత్తవారిల్లు) నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలను ఆదివారం ఉదయం భారీ ఊరేగింపుతో అమ్మవారి పుట్టిల్లుగా భావించే శతకంపట్టు పందిరిలో ఉంచుతారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీంతో మోదకొండమ్మ ఉత్సవాలు మొదలవుతాయి. సోమ, మంగళవారాలు కూడా శతకంపట్టులోనే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మంగళవారం సాయంత్రం శతకంపట్టు నుంచి అమ్మవారిని తిరిగి ఆలయానికి చేర్చడం(అనుపోత్సవం)తో ఉత్సవాలు ముగుస్తాయి. అనుపోత్సవం అంత్యంత వైభవంగా జరుగుతుంది. 12వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పట్టణవీధుల్లో ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొంటారు.
ప్రభుత్వ శాఖల స్టాళ్లు
పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యక్రమాలు, పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏజెన్సీలో ఐటీడీఏ చేపట్టిన అభివృద్ధిపై సమాచార శాఖ ఆధ్వర్యంలో ఫొటో ప్రదర్శన, జీసీసీ, వ్యవసాయ, ఉద్యానవన, కాఫీ, వైద్య, ఐసీడీఎస్, వెలుగు, ఇంజనీరింగ్ శాఖల కార్యక్రమాలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేస్తారు.
ఉత్సవాల్లో వినోదాలు....
ఉత్సవాలకు వచ్చే వారంతా ఉత్సాహంగా, ఆనందంగా గడిపేందుకు సంప్రదాయ, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రకాల వస్తువుల విక్రయాలతోపాటు పిల్లలు ఆడుకునేందుకు రంగుల రాట్నాలు, జెయింట్ వీల్స్, డిస్కోడాన్స్, డ్రాగన్ ట్రైన్, చిన్నపాటి మోటార్ సైకిళ్లు, కార్లు, టాయ్‌ట్రైన్‌లు, సర్కస్, డైనోసార్ ఉయ్యాలతోపాటు పలు రకాల ఆటలు ఏర్పాటు చేస్తున్నారు. మూడు రోజులపాటు సినీ, టీవీ కళాకారులతో ప్రదర్శనలు, ఆర్కెస్ట్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
900 మందితో పోలీసు భారీ బందోబస్తు
మోదకొండమ్మ ఉత్సవాలకు పోలీసు అధికారులు 900 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక అధికారులు, సిబ్బందితోపాటు ఇతర మండలాల నుంచి పలువురు సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెచ్‌సీలు, పీసీలను బందోబస్తు కోసం పాడేరు రప్పించారు. బందోబస్తు ఏర్పాట్లను జిల్లా అడిషనల్ ఎస్‌పీ కె.ధీరజ్, స్థానిక డీఎస్‌పీ సహబాజ్ అహ్మద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాడేరులో నాలుగుచోట్ల పోలీస్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
భారీఎత్తున విద్యుత్ అలంకరణ
మోదకొండమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలో పలుచోట్ల భారీ విద్యుత్ సెట్టింగులు ఏర్పాటు చేశారు. మోదకొండమ్మ ఆలయం మొదలుకుని పట్టణంలోని మెయిన్‌రోడ్లు, వీధులను సైతం విద్యుద్దీపాలతో అలంకరించారు. అంబేడ్కర్ సెంటర్, మెయిన్‌బజార్, సినిమా హాల్ సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్ మార్గాల్లో ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ సెట్టింగులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఉత్సవాలు విజయవంతం చేయాలి
అధికారులకు ఇన్‌ఛార్జి కలెక్టర్, జేసీ అభిషేక్‌గౌడ ఆదేశం
అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో మోదకొండమ్మ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్, జేసీ వి.అభిషేక్‌గౌడ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం సాయంత్రం సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని ఆయా శాఖల అధికారుకు సూచించారు. తాగునీరు, మరుగుదొడ్లు, రవాణా, ఆహార పంపిణీ, ప్రధాన వేదిక నిర్వహణపై ఆరా తీశారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు తాగునీరు, ఆహార పొట్లాల పంపిణీ పక్కాగా వుండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. పారిశుధ్య పనులు నిరంతరం చేపట్టాలని, వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, మందులు, అంబులెన్సులను అందుబాటులో ఉంచాలన్నారు. ఆయన వెంట రోడ్ల, భవనాల శాఖ ఈఈ బాలసుందరంబాబు, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, తదితరులు వున్నారు.
మోదకొండమ్మ ఉత్సవాలకు 63 ఆర్టీసీ బస్సులు
పాడేరురూరల్, మే 10 (ఆంధ్రజ్యోతి): పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 63 బస్సు సర్వీసులను నడపనున్నట్టు డీటీడీఎం టి.ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. పాడేరు డిపోలో వున్న 45 బస్సులతోపాటు మైదాన ప్రాంతంలోని డిపోల నుంచి 18 బస్సులను రప్పించినట్టు చెప్పారు. రాజమహేంద్రవరం, కాకినాడకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్టు పేర్కొన్నారు. పాడేరు డివిజన్ పరిధిలోని అన్ని మండలాల నుంచి భక్తుల రద్దీకి అనుగుణంగా మూడు రోజులపాటు పాడేరుకు ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆయన చెప్పారు. ప్రయాణికుల నుంచి సాధారణ చార్జీలు మాత్రమే వసూలు చేయాలని సిబ్బందికి సూచించినట్టు తెలిపారు.