పంచాయతీలకు పండుగ
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:06 AM
పంచాయతీలకు ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేసింది. జిల్లాకు రూ.48 కోట్ల 63 లక్షలు మంజూరయ్యాయి. జిల్లాలోని 22 మండలాల పరిధిలో 430 గ్రామ పంచాయతీలకు గాను 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి.
15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు
జిల్లాకు రూ.48.63 కోట్లు
పల్లెల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం
పాడేరు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పంచాయతీలకు ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేసింది. జిల్లాకు రూ.48 కోట్ల 63 లక్షలు మంజూరయ్యాయి. జిల్లాలోని 22 మండలాల పరిధిలో 430 గ్రామ పంచాయతీలకు గాను 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. పంచాయతీల జనాభా ఆధారంగా ఆయా నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఆయా నిధులను 70 శాతం పంచాయతీలకు, 15 శాతం చొప్పున జడ్పీటీసీ, ఎంపీటీసీ సిగ్మెంట్‌లకు కేటాయిస్తుంది. మొత్తం రూ.48 కోట్ల 63 లక్షల్లో టైడ్ గ్రాంట్ రూ.29 కోట్ల 18 లక్షలు కాగా, అన్‌టైడ్ గ్రాంట్ రూ.19 కోట్ల 45 లక్షలుగా విభజించారు. టైడ్ గ్రాంట్‌ను కేంద్ర ప్రభుత్వం సూచించిన అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాల్సి ఉండగా, అన్‌టైడ్ గ్రాంట్‌ను గ్రామ పంచాయతీల అవసరాల మేరకు స్వయం నిర్ణయంతో వినియోగించుకునే వెసులుబాటు ఉంది. ఆయా నిధులను సద్వినియోగం చేసుకుని పల్లెల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. పంచాయతీ లు ఆర్థిక పరిపుష్టి కావడంతో సర్పంచులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.