Share News

బడిలో పండుగ!

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:52 AM

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో శుక్రవారం పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘మెగా పేరెంట్‌-టీచర్‌ సమావేశాలను (మెగా పీటీఎం-3.0) పెద్ద ఎత్తున నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది.

బడిలో పండుగ!
పాయకరావుపేటలో విద్యార్థినులు, తల్లిదండ్రులతో సెల్ఫీ తీసుకుంటున్న మంత్రి అనిత

ఉల్లాసంగా.. ఉత్సాహంగా మెగా పీటీఎం 3.0

పలు పాఠశాలల్లో ముఖ్య అతిథులుగా హాజరైన స్పీకర్‌ అయ్యన్న, హోం మంత్రి అనిత, ఎమ్మెల్యేలు

పాఠశాలల అభివృద్ధి ప్రణాళికలపై చర్చ

ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం

అనకాపల్లి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో శుక్రవారం పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘మెగా పేరెంట్‌-టీచర్‌ సమావేశాలను (మెగా పీటీఎం-3.0) పెద్ద ఎత్తున నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది.

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యాభివృద్ధికి పలు చర్యలు చేపట్టింది. అదే విధంగా కొత్త సంస్కరణలను అమలు చేస్తున్నదని. ఇందులో భాగంగా పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల పురోగతి, మౌలిక వసతులు, ఇతర అంశాలపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించే కొత్త సంప్రదాయానికి తెర తీసింది. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో జూలై నెలలో ఒకసారి ఇటువంటి సమావేశాన్ని నిర్వహించింది. తాజాగా శుక్రవారం మరోసారి ‘మెగా పీటీఎం 3.0’ ఏర్పాటు చేసింది. వివిధ ప్రభుత్వ యాజమాన్యాల్లోని అన్ని రకాల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో నిర్వహించిన సమావేశాలకు విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్దలు హాజరయ్యారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించిన ఈ సమావేశాల్లో ఆయా విద్యా సంస్థల్లో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలపై చర్చలు జరిపి, పలు సూచనలు చేశారు. తరువాత ఆటపాటలు, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సరదాగా గడిపారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మధ్యాహ్నం పాఠశాలలోనే విద్యార్థులతో కలిసి భోజనాలు చేశారు.

నర్సీపట్నంలో జడ్పీ ఉన్నత పాఠశాల, గొలుగొండ మండలం జోగంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశాలకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, పాయకరావుపేటలో జరిగిన సమావేశానికి హోం మంత్రి వగలపూడి అనిత ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కె.కోటపాడు మండలం గొల్లలపాలెం కేజీబీవీలో, దేవరాపల్లి మండలం తెనుగుపూడిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు చోడవరంలోని కొత్తూరు బాలికల ఉన్నత పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాలలో, బుచ్చెయ్యపేట మండలం వడ్డాది కేఏడీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ ఎలమంచిలి మండలం ఏటికొప్పాక జడ్పీ ఉన్నత పాఠశాలలో, అనకాపల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అనకాపల్లి మండలం సిరసపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన పీటీఎంలకు హాజరై ప్రసంగించారు. కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం పాఠశాలలో, పీవీజీ కుమార్‌ మాడుగుల జడ్పీ ఉన్నత పాఠశాలలో, గండి బాబ్జీ సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెం పాఠశాలలో జరిగిన సమావేశాలకు హాజరయ్యారు.

విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాం: మంత్రి అనిత

పాయకరావుపేట, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. పాయకరావుపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం వారి నడవడికలపై దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. అనంతరం ఆమె విద్యార్థినులు, తల్లిదండ్రులతో సెల్ఫీలు దిగారు.

Updated Date - Dec 06 , 2025 | 12:52 AM