కళాశాలకు వెళ్లాలంటే భయం
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:48 PM
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. ఈ భవనం శ్లాబ్ పెచ్చులు ఊడిపడుతుండడంతో తమ పిల్లలు గాయపడతారేమోనని తల్లిదండ్రులు భీతిల్లుతు న్నారు.
శిథిలావస్థలో అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ
తరగతి గదుల్లో శ్లాబ్ పెచ్చులూడి పడుతున్న వైనం
బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న విద్యార్థులు, అధ్యాపకులు
గత ప్రభుత్వంలో పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం శూన్యం
మూడేళ్ల క్రితం పీజీ సెంటర్ మంజూరైనా కోర్సులు ప్రారంభించని దుస్థితి
అరకులోయ, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. ఈ భవనం శ్లాబ్ పెచ్చులు ఊడిపడుతుండడంతో తమ పిల్లలు గాయపడతారేమోనని తల్లిదండ్రులు భీతిల్లుతు న్నారు.
రాష్ట్రంలోనే శత శాతం అడ్మిషన్లు జరిగే కళాశాలగా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పేరుంది. ఈ కళాశాలలో సుమారు 1000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ కళాశాల భవనం 2015 జనవరి 21న ప్రారంభమైంది. ఏడు గదులతో ఈ భవనాన్ని నిర్మించారు. ఇందులో లేబొరేటరీ, గ్రంథాలయం, అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు తరగతులు నిర్వహించడానికి పక్కనే ఉన్న టీటీసీకి చెందిన భవనాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ భవనంలో 25 గదులు ఉండగా, 12 పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. మిగతా 13 గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఒక్కో గదిలో 20 మందికి మించి విద్యార్థులు పట్టరు. కానీ ఒక్కో గదిలో 60 మందిని కూర్చోబెడుతున్నారు. కాగా ఈ గదుల్లో శ్లాబ్‌లు శిథిలావస్థకు చేరి పెచ్చులూడి పడుతుండడంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. చాలీచాలని గదులు, శిథిల భవనంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువగా శ్లాబ్ పెచ్చులూడిపోతున్న గదుల్లో తరగతులు నిర్వహించడం లేదని, కాస్త బాగున్న గదుల్లోనే విద్యార్థులను కూర్చోబెడుతున్నామని ప్రిన్సిపాల్ భరత్‌కుమార్ తెలిపారు.
పీజీ సెంటర్ మంజూరై మూడేళ్లయినా..
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అనుబంధంగా పీజీ సెంటర్ మంజూరై మూడేళ్లు పూర్తయింది. 2022లో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ ఇంగ్లీషు కోర్సులు మంజూరయ్యాయి. అయితే తరగతి గదులు లేకపోవడంతో ఇప్పటి వరకు ఈ కోర్సులను ప్రారంభించలేదు. ఈ కళాశాల దుస్థితి గురించి గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని అధ్యాపకులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.