శరవేగంగా విత్తన గిడ్డంగి
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:55 AM
మండలంలోని గంధవరంలో ఏర్పాటవుతున్న జిల్లాస్థాయి విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రం మరో ఐదారు నెలల్లో అందుబాటులోకి రానున్నది. గత ఏడాది కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు రూ.4.7 కోట్లతో చేపట్టిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ కేంద్రం నిర్మాణ పనులు పూర్తయితే ఉమ్మడి విశాఖ జిల్లా రైతులకు ఇక్కడి నుంచే వివిధ రకాల విత్తనాలు సరఫరా అవుతాయి.
గంధవరంలో చురుగ్గా సాగుతున్న నిర్మాణ పనులు
సెప్టెంబరు నాటికి పూర్తవుతాయని అంచనా
2026 ఖరీఫ్ నుంచి విత్తన శుద్ధి, రైతులకు విత్తనాలు సరఫరా
విశాఖ, అల్లూరి జిల్లాల్లో కూడా విత్తన గిడ్డంగులు
చింతపల్లి, పద్మనాభం మండలం కృష్ణాపురంలో భూసేకరణ
చోడవరం, ఏప్రిల్ 24 (ఆంఽధ్రజ్యోతి): మండలంలోని గంధవరంలో ఏర్పాటవుతున్న జిల్లాస్థాయి విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రం మరో ఐదారు నెలల్లో అందుబాటులోకి రానున్నది. గత ఏడాది కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు రూ.4.7 కోట్లతో చేపట్టిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ కేంద్రం నిర్మాణ పనులు పూర్తయితే ఉమ్మడి విశాఖ జిల్లా రైతులకు ఇక్కడి నుంచే వివిధ రకాల విత్తనాలు సరఫరా అవుతాయి.
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడా విత్తన గిడ్డంగి లేదు. జిల్లా రైతులకు అవసరమైన విత్తనాలు విజయనగరం జిల్లాలోని గోదాము నుంచి సరఫరా అవుతుంటాయి. ఈ నేపథ్యంలో జిల్లా రైతులకు వివిధ పంటల సాగుకు మేలైన విత్తనాలను అందజేయడానికి జిల్లాలోనే విత్తన గిడ్డంగి ఏర్పాటు చేయాలని టీడీపీ గతంలో అధికారంలో వున్నప్పుడు 2108లో నిర్ణయించింది. చోడవరం మండలం గంధవరంలో విత్తన గిడ్డంగి, విత్తనశుద్ధి కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇచ్చి, దీనికి ఐదు ఎకరాలు కేటాయించింది. స్థల సేకరణ పూర్తయ్యే సమయానికి రాష్ట్రంలో ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఏడాది వరకు విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రం నిర్మాణం గురించి పాలకులు పట్టించుకోలేదు. ఎట్టకేలకు రూ.4.7 కోట్ల అంచనా వ్యయంతో 2020 జూలై 9వ తేదీన అప్పటి మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శంకుస్థాపన చేశారు. 40 వేల క్వింటాళ్ల నిల్వ సామర్థ్యం కలిగిన వీటి నిర్మాణ పనులను ఏడాదిలో పూర్తిచేసి, రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. కానీ శంకుస్థాపన చేసిన తరువాత సుమారు నాలుగేళ్లపాటు అధికారంలో వున్నప్పటికీ పునాదులు కూడా నిర్మించలేదు.
కూటమి ప్రభుత్వం రాకతో కదలిక
వైసీపీ హయాంలో నాలుగేళ్లపాటు శిలాఫలకానికే పరిమితమైన విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రం నిర్మాణ పనులకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కదలిక వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు తరచూ గంధవరం వెళ్లి నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవల పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబరునాటికి గోదామును అందుబాటులోకి తేవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. గోదాము నిర్మాణం పూర్తయిన తరువాత విత్తన శుద్ధికి అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేస్తారు. రానున్న ఖరీఫ్‌కు ఎప్పటి మాదిరిగానే విజయనగరం జిల్లాలోని గోదాము నుంచి విత్తనాలు సరఫరా అవుతాయి. 2026 ఖరీఫ్ నుంచి గంధవరం నుంచి విత్తనాల సరఫరా జరుగుతుంది. అనకాపల్లితోపాటు విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లా రైతులకు కూడా ఇక్కడి నుంచే విత్తనాలను సరఫరా చేస్తారు. గత వైసీపీ ప్రభుత్వం శ్రద్ధ చూపి వుంటే నాలుగేళ్ల క్రితమే ఈ కేంద్రం అందుబాటులోకి వచ్చి వుండేదని రైతులు అంటున్నారు.
విశాఖ, అల్లూరి జిల్లాల్లో సైతం విత్తన గోదాములు?
విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కూడా విత్తన శుద్ధి, నిల్వ గోదాములు నిర్మించడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేసినట్టు తెలిసింది. అల్లూరి జిల్లాలోని చింతపల్లి, విశాఖ జిల్లాలోని పద్మనాభ మండలం కృష్ణాపురం వద్ద వీటిని నిర్మించడానికి ఇప్పటికే భూ సేకరణ పూర్తయినట్టు సమాచారం.