Share News

రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలి

ABN , Publish Date - Oct 04 , 2025 | 12:40 AM

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా చిన్న, సన్నకారు రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సూచించారు. ఉమ్మడి జిల్లాలో వివిధ సహకార సంఘాలకు ఇటీవల నియమితులైన (నామినేటెడ్‌) పాలకవర్గాలకు శుక్రవారం స్థానిక కల్యాణ మండపంలో శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్పీకర్‌ మాట్లాడుతూ, సహకార సంఘాల్లో కొత్తసభ్యులను చేర్పించడంతోపాటు, వ్యాపారాన్ని పెంచడంపై దృష్టి సారించాలని అన్నారు.

రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు. వేదికపై డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు, ఎమ్మెల్యేలు కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, బండారు, హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ తాతయ్యబాబు

పీఏసీఎస్‌ల వ్యాపారం పెంపుపై దృష్టి పెట్టండి

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

సహకార సంఘాల నామినేటెడ్‌ పాలకవర్గాలకు శిక్షణ

చోడవరం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా చిన్న, సన్నకారు రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సూచించారు. ఉమ్మడి జిల్లాలో వివిధ సహకార సంఘాలకు ఇటీవల నియమితులైన (నామినేటెడ్‌) పాలకవర్గాలకు శుక్రవారం స్థానిక కల్యాణ మండపంలో శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్పీకర్‌ మాట్లాడుతూ, సహకార సంఘాల్లో కొత్తసభ్యులను చేర్పించడంతోపాటు, వ్యాపారాన్ని పెంచడంపై దృష్టి సారించాలని అన్నారు. చైర్మన్లకు ఉండే అధికారాలు, హక్కులు తెలుసుకోవాలని, కార్యదర్శులపై ఆధారపడవద్దని చెప్పారు. గ్రామాల్లో చిరువ్యాపారులకు విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. సహకార సంఘాల ద్వారా ఇచ్చే రుణాలకు తప్పనిసరిగా బీమా ప్రీమియం కట్టించుకోవాలని స్పష్టం చేశారు. రుణం తీసుకున్న వ్యక్తి తిరిగి రుణం చెల్లించకుండా చనిపోతే, అతనిపై ఆధారపడిన కుటుంబం రుణం చెల్లించవలసి వస్తుందని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని, అందువల్ల రుణగ్రహీతలందరికీ బీమా చేయించాలని చెప్పారు. రైతులకు అవగాహన కల్పించి బీమా ప్రీమియం వసూలు చేయాలన్నారు. సొంత గూడు లేని సహకార సంఘాలు స్థలం సమకూరిస్తే డీసీసీబీ భవనాలు నిర్మిస్తుందని ఆయన చెప్పారు. సంఘాల ఆధ్వర్యంలో ఎరువులు విక్రయించాలని సూచించారు. జీఎస్‌టీ సంస్కరణల వల్ల వ్యవసాయ పరికరాల ధరలు తగ్గినందున, వీటి కొనుగోలుకు రుణాలు అందించాలని చెప్పారు.

డీసీసీబీ పర్సన్‌ఇన్‌చార్జి కోన తాతారావు మాట్లాడుతూ, సహకార సంఘాల ద్వారా రైతులకు డ్రోన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. సహకార సంఘాల సభ్య రైతులు సహజంగా మరణిస్తే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తూ మృతిచెందితే రూ.5 లక్షలు పరిహారాన్ని ఇవ్వాలని యోచిస్తున్నామన్నారు. చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, బండారు సత్యనారాయణమూర్తిలు మాట్లాడుతూ, సహకార సంఘాల ద్వారా అవినీతికి తావులేకుండా రైతులకు సేవలు అందించాలని కోరారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం జిల్లాలో 98 సహకార సంఘాల్లో 78 సంఘాలకు పాలకవర్గాలను నియమించిందని, మిగిలిన సంఘాలకు త్వరలోనే పాలకవర్గాలు నియమించనున్నదన్నారు. సమావేశంలో డీసీసీబీ సీఈవో వర్మ, టీడీపీ నాయకులు గూనూరు మల్లునాయుడు, పెదబాబు, జనసేన నాయకులు సిరిపురపు రమేశ్‌, గూనూరు మూలినాయుడు, మజ్జి గౌరీశంకర్‌, అన్నవరం చిన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2025 | 12:40 AM