ఆందోళనలో అన్నదాతలు
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:18 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు మొదలవ్వడం, తుఫాన్ తీరానికి దగ్గరవుతున్నకొద్ది ఈదురు గాలులు పెరుగుతుండడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తుఫాన్‌తో వరిపైరుకు నష్టం వాటిల్లుతుందని గుబులు
పొలాల్లో మూడు రోజులకు మించి అధికంగా నీరు నిల్వ ఉంటే దిగుబడిపై ప్రభావం
కూరగాయలు, అపరాల పంటలకూ నష్టం
చోడవరం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి):
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు మొదలవ్వడం, తుఫాన్ తీరానికి దగ్గరవుతున్నకొద్ది ఈదురు గాలులు పెరుగుతుండడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిసి పంటలు మునిగిపోతే పూర్తిగా నష్టపోతామని వాపోతున్నారు. ఖరీఫ్ వరి పంట ఇప్పుడు పొట్ట, గింజ పాలుపోసుకునే దశల్లో ఉంది. ముందుగా నాట్లు వేసిన ప్రాంతాల్లో గింజ కడుతున్నది. ఈ పరిస్థితుల్లో రెండు, మూడు రోజులకు మించి పొలాల్లో అధిక నీరు వుంటే ధాన్యం దిగుబడిపై తీవ్రం ప్రభావం చూపుతుందని రైతులు అంటున్నారు. సోమవారం సాయంత్రం వరకు మోస్తరు వర్షం పడడంతో పొలాలు ఎక్కడా ముంపునకు గురికాలేదు. అయితే రాత్రి నుంచి భారీ వర్షం కురిస్తే అవకాశం వుండడంతో రైతులలో గుబులు చెందుతున్నారు. మురుగునీటి పారుదల వ్యవస్థ బాగున్నచోట ఇబ్బంది లేదని, డ్రైనేజీ కాలువల నిర్వహణ సరిగాలేని ప్రాంతాలు, లోతట్టు భూముల్లో వరద ముంపు తప్పదని అంటున్నారు. ఇదే సమయంలో పెద్దేరు, రైవాడ, కోనాం, కల్యాణపులోవ జలాశయాల నుంచి పెద్ద మొత్తంలో వరద నీటిని విడుదల చేస్తే మాడుగుల, చోడవరం, అనకాపల్లి, ఎలమంచిలి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో వరిపొలాలు మునగడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు.
వరితోపాటు కూరగాయలు, అపరాల పంటలను తుఫాన్ దెబ్బతీస్తుందని అంటున్నారు. కార్తీక మాసంలో కూరగాయలకు వుండే గిరాకీని దృష్టిలో పెట్టుకుని రైతులు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో విత్తనాలు వేయడం, నారునాటడం వంటి పనులు చేస్తుంటారు. ఆయా పంటలు ప్రస్తుతం కాపు దశలో వున్నాయి. ఇప్పుడు భారీ వర్షాలు కురిస్తే పొలాలు నీట మునిగి మొక్కలు కుళ్లిపోయి చనిపోతాయని రైతులు వాపోతున్నారు.