Share News

వర్షాలతో రైతుల్లో గుబులు

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:55 AM

అల్పపీడనం కారణంగా బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలుల ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ సమాచారంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం ‘మొంథా’ తుఫాన్‌ సంభవించి భారీ వర్షాలు పడడంతో సుమారు మూడున్నర వేల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది.

వర్షాలతో రైతుల్లో గుబులు
సబ్బవరంలో వెన్ను దశలో వరి పైరు

జిల్లాలో 13 మి.మీ. సగటు వర్షపాతం

‘నాతవరం’లో అత్యధికంగా 64.8 మి.మీ. నమోదు

రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం

తుఫాన్‌ వరద ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వరి

ఇంతలోనే వర్షాలు కురిస్తే నష్టపోతామని అన్నదాతలు ఆందోళన

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

అల్పపీడనం కారణంగా బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలుల ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ సమాచారంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం ‘మొంథా’ తుఫాన్‌ సంభవించి భారీ వర్షాలు పడడంతో సుమారు మూడున్నర వేల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. ముంపు ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే వరిపైరు తేరుకుంటున్నది. మళ్లీ ఇంతలోనే వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సోమవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు జిల్లాలో సగటున 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాతవరం మండలంలో అత్యధికంగా 64.8 మిల్లీ మీర్ల వర్షం కురిసింది. బుచ్చెయ్యపేటలో 52.2, పాయకరావుపేటలో 31.8, చోడవరంలో 28.4, కశింకోటలో 28.4, అనకాపల్లిలో 26.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చీడికాడ, సబ్బవరం, కోటవురట్ల, నక్కపల్లి, ఎస్‌.రాయవరం, రాంబిల్లి మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. మంగళవారం పగలు చాలా మండలాల్లో ఆకాశం మేఘావృతమై వుంది.

‘మొంథా’తో 1,381 హెక్టారుల్లో వరికి నష్టం

మొంథా తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో 1,381 హెక్టారుల్లో వరి పంట నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అనకాపల్లి మండలంలో అత్యధికంగా 570 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. బుచ్చెయ్యపేటలో 93, చోడవరంలో 84, సబ్బవరంలో 54, కశింకోటలో 65, మునగపాకలో 79, దేవరాపల్లిలో 24, కె.కోటపాడులో 49, చీడికాడలో 8, గొలుగొండలో 14, నర్సీపట్నంలో 21, నాతవరంలో 10, అచ్యుతాపురంలో 4, మాడుగులలో 2, కోటవురట్లలో 2, రాంబిల్లిలో 78, పరవాడలో 6, రావికమతంలో 7 ఎలమంచిలిలో 35 హెక్టార్లలో వరి నీట మునిగింది. 64.2 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగాయి. ఇందులో బొప్పాయి 6 హెక్టార్లు, అరటి 9.6, కూరగాయలు 10.2 హెక్టార్లు వున్నాయి. కాగా భారీ వర్షాల కారణంగా ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన 366.92 కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 13 కల్వర్టులు ధ్వంసం అయ్యాయి.

Updated Date - Nov 05 , 2025 | 12:55 AM