రైతుల్లో గుబులు
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:28 PM
దిత్వా తుఫాన్ రైతుల్లో గుబులు రేపుతోంది. చేతికొచ్చిన పంట ఎక్కడ నేలపాలవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కోతలు పూర్తి చేసిన రైతులు వరి పనలను కుప్పలుగా పెట్టారు.
తుఫాన్ హెచ్చరికలతో చేతికొచ్చిన పంట చేజారుతుందని ఆందోళన
ఇప్పటికే సుమారు 30 శాతం మేర కోతలు పూర్తి
అప్రమత్తం చేసిన వ్యవసాయాధికారులు
సబ్బవరం, నవంబరు 30 (ఆంద్రజ్యోతి): దిత్వా తుఫాన్ రైతుల్లో గుబులు రేపుతోంది. చేతికొచ్చిన పంట ఎక్కడ నేలపాలవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కోతలు పూర్తి చేసిన రైతులు వరి పనలను కుప్పలుగా పెట్టారు.
మండలంలోని గొర్లివానిపాలెం, గుల్లేపల్లి, వంగలి, అంతకాపల్లి, రావలమ్మపాలెం, సబ్బవరం, అమృతపురం, అసకపల్లి, గొల్లలపాలెం, ఆరిపాక, టెక్కలిపాలెం, మొగలిపురం, మలునాయుడుపాలెం, తదితర గ్రామాల్లో రైతులు వారం రోజుల క్రితం వరి కోతులు ప్రారంభించారు. మండల వ్యాప్తంగా 25 నుంచి 30 శాతం మేర వరి కోతలు పూర్తయ్యాయి. అయితే గత మూడు రోజుల నుంచి దిత్వా తుఫాన్ హెచ్చరికలతో వ్యవసాయాధికారులు రైతులను అప్రమత్తం చేశారు. కోతలు పూర్తిగా నిలిపివేసి కోసిన వరి పనలను కుప్పలుగా పెట్టుకోవాలని సూచించడంతో పలు గ్రామాల్లో రైతులు పొలాల్లోనే కుప్పలు పెట్టేశారు. శనివారం మధ్యాహ్నం ఆకాశం మేఘావృతం కావడంతో రైతులో అందోళన మొదలైంది. దీంతో తడి ఆరకుండానే శనివారం కొంత మంది కుప్పలు పెట్టడం కనిపించింది. ఆదివారం కూడా ఆకాశం మేఘావృతం కావడంతో రైతులు ఉరుకులు, పరుగులుతో కుప్పలు పెట్టడం కనిపించింది. రెండు రోజుల పాటు వరి కోతలు కోయవద్దని వ్యవసాయాధికారులు రైతులకు సమాచారం ఇచ్చారు.