రైతుల్లో గుబులు
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:05 AM
మండలంలోని వరి పంటలు దాదాపు కోత దశకు వచ్చాయి. ఈ సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కోత దశకు వచ్చిన 80 శాతం వరి పంట
అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయేమోనని ఆందోళన
ఇప్పటికే 20 శాతం కోతలు పూర్తి
పొలాల్లోనే కుప్పలు వేసిన వైనం
సబ్బవరం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వరి పంటలు దాదాపు కోత దశకు వచ్చాయి. ఈ సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో వచ్చిన మొంథా తుఫాన్ వలన మండల రైతాంగానికి పెద్దగా నష్టం లేకపోయినా టెన్షన్‌కు గురయ్యారు. అయితే ఈసారి ఏం జరుగుతుందోనని గుబులు చెందుతున్నారు. కాగా ఇప్పుడు పెద్దగా ప్రభావం ఉండదన్న సమాచారంతో వంగలి, నాయనమ్మపాలెం, అంతకాపల్లి, గుల్లేపల్లి, గొర్లివానిపాలెం, సబ్బవరం, టెక్కలిపాలెం, మొగలిపురం, మలునాయుడుపాలెం, అసకపల్లి, బాటజంగాలపాలెం, నారపాడు తదితర గ్రామాల్లో సుమారు 20 శాతం మంది రైతులు ఇప్పటికే కోతలు పూర్తి చేశారు. దీంతో ఆదివారం చాలా గ్రామాల్లో రైతులు పొలాల్లో కుప్పలు వేశారు. ఈ ఏడాది సాధారణ వరి సాగు విస్తీర్ణం 1,306 హెక్టార్లు కాగా, వాతావరణం అనుకూలంగా ఉండడంతో 1,338 హెక్టార్లలో వరి నాట్లు వేశారు. ప్రస్తుతం మండలంలో 80 శాతం వరి పంట కోత దశకు వచ్చిందని, మరో పది రోజుల్లో కోతలు మొదలవుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మండలంలో 20 శాతం వరకు వరి కోతలు పూర్తయ్యాయని తెలిపారు. కోసిన పంటను జాగ్రత్త చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.