నూతన యాజమాన్య పద్ధతులతో రైతులకు మేలు
ABN , Publish Date - Sep 04 , 2025 | 11:47 PM
ఆదివాసీ రైతులు నూతన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నాణ్యమైన పసుపు దిగుబడులు సాధించవచ్చునని ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, శాస్త్రవేత్త చెట్టి బిందు తెలిపారు. గురువారం ఉద్యాన పరిశోధన స్థానంలో ఎఫ్‌పీవో ప్రతినిధులు, రైతులతో స్పైస్ బోర్డు పసుపు పంటలో నాణ్యత పెంపు అంశంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది.
నాణ్యమైన పసుపు దిగుబడులు సాధించవచ్చు
ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, శాస్త్రవేత్త బిందు
చింతపల్లి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి):
ఆదివాసీ రైతులు నూతన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నాణ్యమైన పసుపు దిగుబడులు సాధించవచ్చునని ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, శాస్త్రవేత్త చెట్టి బిందు తెలిపారు. గురువారం ఉద్యాన పరిశోధన స్థానంలో ఎఫ్‌పీవో ప్రతినిధులు, రైతులతో స్పైస్ బోర్డు పసుపు పంటలో నాణ్యత పెంపు అంశంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిందు మాట్లాడుతూ రైతులు పసుపును విత్తన శుద్ధి చేసుకుని నాటు కోవాలన్నారు. ఎత్తైన మడుల్లో నాట్లు వేసుకోవాలని సూచించారు. ఈ విధంగా చేయడం వల్ల పసుపు పంటను దుంపకుళ్లు తెగులు నుంచి కాపాడుకోవచ్చునన్నారు. అలాగే దిగుబడులు పెరుగుతాయన్నారు. రెండేళ్ల సాగును విడిచి పెట్టి తొమ్మిది నెలల పంటను సాగు చేసుకోవాలన్నారు. శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులు సిఫారసు చేసిన రకాలను నాటుకోవాలని తెలిపారు. పసుపు ఉడికించడం, ఎండబెట్టడం, పాలిషింగ్ చేయడంలోనూ పరికరాలు వినియోగిస్తూ మెలకువలు పాటించాలన్నారు. స్పైస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ అధికారి బొడ్డు కల్యాణి మాట్లాడుతూ గిరిజన రైతులు ఆర్గానిక్ పద్ధతిలో పసుపు పంటను సాగు చేసుకోవాలని చెప్పారు. గిరిజన రైతులు ఆర్గానిక్ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు స్పైస్ బోర్డు 50 శాతం రాయితీ కల్పిస్తుందన్నారు. అలాగే మిరియాలు, పసుపు పంటల ప్రాసెసింగ్ చేసేందుకు యంత్రాలను రాయితీపై అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త జోగారావు, వీసీఎఫ్ టాటా ట్రస్టు నిపుణుడు డాక్టర్ అప్పలరాజు, కో-ఆర్డినేటర్ వాసు పాల్గొన్నారు.