Share News

రైతు ఉత్పత్తిదారులు ఆర్థికంగా ఎదగాలి

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:25 PM

జిల్లాలోని రైతు ఉత్పత్తిదారు సంఘాలు ఆర్థికంగా ఎదగాలని, అందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు. స్థానిక కాఫీ హౌస్‌లో బుధవారం నిర్వహించిన ‘సంపూర్ణ అభియాన్‌ సమ్మాన్‌ సమారో’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

రైతు ఉత్పత్తిదారులు ఆర్థికంగా ఎదగాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

పాడేరు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రైతు ఉత్పత్తిదారు సంఘాలు ఆర్థికంగా ఎదగాలని, అందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు. స్థానిక కాఫీ హౌస్‌లో బుధవారం నిర్వహించిన ‘సంపూర్ణ అభియాన్‌ సమ్మాన్‌ సమారో’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారులంతా గ్రూప్‌లుగా తయారు కావాలని, ఆయా గ్రూప్‌లకు వ్యవసాయ రుణాలు అందించాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలోని గంగవరం, వై.రామవరం, మారేడుమిల్లి మండలాల్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వ సహాయంతో రైతులను ప్రోత్సహించేందుకు ‘సంపూర్ణ అభియాన్‌ సమ్మాన్‌ సమారో’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అందుకు గాను నీతిఅయోగ్‌ నుంచి రూ.27 కోట్లు విడుదలైందని, వాటితో రైతుల అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని, అందరి సమన్వయంతో దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ మాట్లాడుతూ జిల్లాను కేంద్ర ప్రభుత్వం ఆకాంక్ష జిల్లాగా గుర్తించిందన్నారు, దేశవ్యాప్తంగా 114 జిల్లాలను ఆకాంక్ష జిల్లాలుగా గుర్తిస్తే అందులో మన జిల్లా ఉండడం గర్వకారణమన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని గంగవరం, వై.రామవరం, మారేడుమిల్లి మండలాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం, అంగన్‌వాడీ, స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతారన్నారు. ఆయా శాఖలకు చెందిన అధికారులు ఈ మూడు మండలాల్లో కేంద్ర ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ అందరి సమన్వయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనను విజయవంతం చేశారని కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందన్నారు. కార్యక్రమంలో భాగంగా రైతులను ప్రోత్సహించే పది స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఆకాంక్ష మండలాల్లోని ప్రగతికి కృషి చేసిన అధికారులకు ప్రశంసాపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ విశ్వేశ్వరనాయుడు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి, గంగవరం, వై.రామవరం, మారేడుమిల్లి మండలాల ఎంపీడీవోలు, రైతు ఉత్పత్తిదారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 11:25 PM