తాచేరు గెడ్డలో పడి రైతు మృతి
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:51 AM
మండలంలోని విజయరామరాజుపేట వద్ద తాచేరు కాజ్‌వే దాటుతూ ఒక రైతు నీటిలో కొట్టుకుపోయి మృతిచెందాడు. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 25 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని విజయరామరాజుపేట వద్ద తాచేరు కాజ్‌వే దాటుతూ ఒక రైతు నీటిలో కొట్టుకుపోయి మృతిచెందాడు. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
వడ్డాదికి చెందిన కాళ్ల సుబ్బారావు (70) బుధవారం మధ్యాహ్నం తరువాత తాచేరు గెడ్డకు అవతలవైపు వున్న పశువుల పాకల వద్దకు బయలుదేరాడు. విజయరామరాజుపేట వద్ద ధ్వంసమైన కాజ్‌వేను ఒక వైరు సాయంతో దాటాడు. సాయంత్రం తిగిరి ఇంటికి వచ్చే క్రమంలో కాజ్‌వే వద్ద పట్టుతప్పి నీటిలో పడి కొట్టుకుపోయాడు. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో కాపాడలేకపోయారు. సుబ్బారావు చీకటి పడిన తరువాత ఇంటికి రాకపోవడంతో పశువుల పాకవద్దనే వుండి వుంటాడని కుటుంబ సభ్యులు భావించారు. గురువారం ఉదయం కూడా ఇంటికి రాకపోవడంతో పశువుల పాక వద్దకువెళ్లి చూశారు. అక్కడ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తాచేరు గెడ్డలో గాలింపు చర్యలు చేపట్టారు. కాజ్‌వేకు సుమారు 100 మీటర్ల దూరంలో సుబ్బారావు మృతదేహం కనిపించింది. నీటిలో నుంచి ఒడ్డుకు చేర్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ శ్రీనివాసరావు వచ్చి పరిశీలించారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా ఇదే కాజ్‌వే వద్ద మంగళవారం ఉదయం ఎనిమిదో తరగతి విద్యార్థి నీటిలో పడి గల్లంతై మృతిచెందాడు.
,