ప్రహసనంగా ఏయూ దూరవిద్య పరీక్షలు
ABN , Publish Date - Dec 18 , 2025 | 01:27 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య కోర్సులకు సంబంధించి నిర్వహిస్తున్న పరీక్షలు ప్రహసనంగా మారాయి. గత నెలలో జరిగిన పరీక్షల్లో కొన్నిచోట్ల యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ జరిగినట్టు అధికారులు గుర్తించినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
కొత్తవలస ప్రగతి కళాశాలలో
మాస్ కాపీయింగ్ జరిగినట్టు నిర్ధారణ
అయినప్పటికీ కానరాని చర్యలు
ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసినా పట్టించుకోని వైనం
ఆధారాలతో సహా పట్టుబడినా పరీక్ష కేంద్రాన్ని కొనసాగిస్తున్న వైనం
విశాఖపట్నం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య కోర్సులకు సంబంధించి నిర్వహిస్తున్న పరీక్షలు ప్రహసనంగా మారాయి. గత నెలలో జరిగిన పరీక్షల్లో కొన్నిచోట్ల యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ జరిగినట్టు అధికారులు గుర్తించినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
దూరవిద్య పరీక్షలు నిర్వహిస్తున్న కొత్తవలసలోని ప్రగతి డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో మాస్ కాపీయింగ్ జోరుగా జరుగుతోందని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. స్పందించిన ఏయూ అధికారులు తనిఖీలకు పంపించారు. అధికారులు వెళ్లే సమయానికి పలువురు విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. అంతేకాకుండా ఒకరికి బదులుగా మరొకరు పరీక్షలు రాస్తున్నట్టు గుర్తించారు. ఇందుకోసం ఆ కాలేజీ యాజమాన్యం ఒక్కో విద్యార్థి వద్ద రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మాస్ కాపీయింగ్ వ్యవహారం ఆధారాలతో సహా పట్టుబడినా ఆ కాలేజీపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత నెలాఖరున ప్రారంభమైన పరీక్షలు ఈనెల తొలివారం వరకు జరిగాయి. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను మార్చడం సాధ్యం కాదని, అందుకే కొనసాగించామని అధికారులు చెప్పారు.
అయితే ఈ నెల రెండో వారం నుంచి మరిన్ని కోర్సులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. వాటికి కూడా అదే సెంటర్‌ను కొనసాగించడం విశేషం. పరీక్ష కేంద్రంలో అక్రమాలు నిర్ధారించినా కొనసాగించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఇటువంటి వ్యవహారాలకు పాల్పడిన పరీక్షా కేంద్రాన్ని తక్షణం రద్దు చేసి దగ్గరలోని మరో కాలేజీకి సదరు విద్యార్థులను బదిలీ చేస్తారు. కానీ కొత్తవలస కాలేజీపై ఏయూ అధికారులు ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో తెలియడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. దీనికి ఉన్నతస్థాయి ఒత్తిళ్లే కారణమంటున్నారు. ఇదే అదనుగా ఆ కాలేజీ యాజమాన్యం ఇప్పటికీ అడ్డగోలు చర్యలకు పాల్పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడ్డంగా దొరికినా చర్యలు తీసుకోకపోవడంతో మరింత రెచ్చిపోతున్నట్టు చెబుతున్నారు.
మళ్లీ అదే కేంద్రంలో...
దూరవిద్య బీఏ, బీఎస్సీ, బీకాం విద్యార్థులకు మొదటి, రెండు, మూడు సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ నెలాఖరు వరకు జరిగే పరీక్షల నిర్వహణకు సుమారు 75 కేంద్రాలను ఏర్పాటుచేశారు. అంతేకాదు కొత్తవలసలోని ప్రగతి కళాశాలను మళ్లీ కేంద్రంగా ఎంపిక చేసి, పరీక్షలు రాసేందుకు అనుమతించడం విశేషం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నా అడ్డగోలు వ్యవహారాలకు పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.