Share News

పొదుపు సొమ్ము స్వాహా చేసిన నకిలీ ఆర్పీ

ABN , Publish Date - Oct 14 , 2025 | 01:18 AM

అక్కయ్యపాలెం (44వ వార్డు)లో నకిలీ రీసోర్స్‌ పర్సన్‌ ఒకరు తమ సంఘానికి చెందిన సొమ్ములు స్వాహా చేశారని కనకమహాలక్ష్మి పొదుపు సంఘం ప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

పొదుపు సొమ్ము స్వాహా చేసిన నకిలీ ఆర్పీ

కలెక్టర్‌కు సంఘం ఫిర్యాదు

విశాఖపట్నం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి):

అక్కయ్యపాలెం (44వ వార్డు)లో నకిలీ రీసోర్స్‌ పర్సన్‌ ఒకరు తమ సంఘానికి చెందిన సొమ్ములు స్వాహా చేశారని కనకమహాలక్ష్మి పొదుపు సంఘం ప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 2020 అక్టోబరులో తమ సంఘం ఏర్పాటుచేశామని, ఆ సమయంలో యూసీడీ నుంచి నియమితులైన ఆర్పీనని ఒక మహిళ వచ్చి కార్యకలాపాలు పర్యవేక్షించడం మొదలుపెట్టారన్నారు. పొదుపు సంఘంలో పది మంది బ్యాంకు పుస్తకాలు, సంఘం రికార్డులు ఆమె తన వద్ద ఉంచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘం ఏర్పాటు తరువాత తొలి ఏడాది రూ.లక్ష, ఆ తరువాత ఏడాది రూ.3 లక్షలు, ఇంకా మరోసారి రూ.7 లక్షలు రుణం తీసుకున్నామని, ప్రతినెలా క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించామన్నారు. సకాలంలో రుణం చెల్లించినందుకు ప్రభుత్వం తమకు ఇచ్చిన వడ్డీ రాయితీని ఆ ఆర్పీ స్వాహా చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. ఇలా సుమారు రూ.1.5 లక్షల వరకు స్వాహా చేశారని, ప్రతినెలా పొదుపు కింద కట్టే రూ.200 ఆమె సొంతానికి వాడుకున్నారని వాపోయారు. ఆమె తీరుపై అనుమానం వచ్చి యూసీడీకి చెందిన అక్కయ్యపాలెం సీఈవోను సంప్రతిస్తే సదరు మహిళ ఆర్పీ కాదన్నారని పేర్కొన్నారు. తమతోపాటు మరో 12 సంఘాలను నకిలీ ఆర్పీ మోసం చేసిందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

Updated Date - Oct 14 , 2025 | 01:18 AM