Share News

నగరంలో నకిలీ మద్యం

ABN , Publish Date - Aug 24 , 2025 | 01:20 AM

నగరంలో డిఫెన్స్‌, నకిలీ విదేశీ మద్యం విక్రయాలు పెరుగుతున్నాయి.

నగరంలో నకిలీ మద్యం

విదేశీ బ్రాండ్ల పేరుతో అమ్మకం

నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్‌ సరకు కూడా అమ్మకం

క్యాంటీన్‌లో తీసుకుని దళారుల ద్వారా బయట విక్రయించుకుంటున్న కొంతమంది ఉద్యోగులు

ఇటీవల ఎక్సైజ్‌ శాఖ దాడుల్లో భారీగా స్వాధీనం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో డిఫెన్స్‌, నకిలీ విదేశీ మద్యం విక్రయాలు పెరుగుతున్నాయి. సులభంగా డబ్బులు సంపాదించవచ్చుననే ఉద్దేశంతో కొందరు దళారుల ద్వారా సరుకు సంపాదించి గుట్టుగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ తరహా ముఠాలను గత కొద్దిరోజులుగా ఎక్సైజ్‌ శాఖ అధికారులు పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు.

తూర్పు నౌకాదళం ప్రధాన కార్యాలయం నగరంలో ఉండడంతో రక్షణ శాఖలో పనిచేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఉద్యోగులకు రక్షణ శాఖ క్యాంటీన్‌ ద్వారా నిత్యావసర సరకులు, గృహోపకరణాలతోపాటు మద్యం కూడా సబ్సిడీపై అందుబాటులో ఉంచుతారు. కొంతమంది ఉద్యోగులు తమ కోటా మద్యాన్ని క్యాంటీన్‌ నుంచి విడిపించుకుని ఇతరులకు అధిక ధరకు విక్రయిస్తుంటారు. అలాంటి వారిని దళారులు గుర్తించి వారి కోటా మద్యాన్ని విడిపించి, సొమ్ము చేసుకుంటున్నారు. డిఫెన్స్‌ మద్యాన్ని ఎంత మొత్తమైనా పెట్టి కొనేందుకు కొందరు సిద్ధపడుతుంటారు. అలాగే విదేశీ మద్యం పేరుతో కొందరు నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నారు. నగరంలో ఈ తరహా వ్యాపారం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోవడంతో నగరంలో మద్యం విక్రయాలపై ప్రభావం పడుతోందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు గుర్తించారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక నిఘా పెట్టి దాడులు తీవ్రతరం చేశారు. ఈనెల 19న గాజువాకలోని ఓ ఫర్నీచర్‌ దుకాణంలో డిఫెన్స్‌ మద్యం విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు దాడి చేయగా 108 బాటిళ్లు లభ్యమయ్యాయి. ఈనెల 14న సీతంపేటలోని ఒక ఇంట్లో విదేశీ మద్యం విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో సోదాలు చేయగా 99 నకిలీ విదేశీ మద్యం సీసాలు దొరికాయి. నెల రోజుల కిందట మధురవాడలోని ఎంవీవీ సిటీలో ఉంటున్న స్టీల్‌ప్లాంటు ఏజీఎం ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించి వివిధ రాష్ట్రాలకు చెందిన మద్యంతోపాటు నకిలీ విదేశీ మద్యం 67 సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గత నెల ఏడున మల్కాపురంలోని ప్రకాష్‌నగర్‌లోని ఒక ఇంటిపై దాడి చేసి 220 డిఫెన్స్‌ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్‌ ఆర్‌.ప్రసాద్‌ వివరణ కోరగా డిఫెన్స్‌ మద్యం విక్రయం, కొనుగోలు...రెండూ నేరమేనన్నారు. ఆ విషయం చాలామందికి తెలియక కొనుగోలు చేస్తున్నారన్నారు. మద్యం కావాలనుకునేవారు లైసెన్స్‌డ్‌ దుకాణాల వద్దనే కొనుగోలు చేయాలన్నారు. హానికరమైన రసాయనాలతో తయారుచేసిన నకిలీ మద్యం సేవిస్తే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందన్నారు. నగరంలో డిఫెన్స్‌, విదేశీ నకిలీ మద్యం పేరుతో జరుగుతున్న విక్రయాలపై ప్రత్యేక సమాచార వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నామన్నారు. అందువల్లనే ఇటీవల కాలంలో వరుసగా కేసులు నమోదుచేస్తున్నామన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 01:20 AM