హైవే కూడళ్లలో పర్యాటకులకు సదుపాయాలు
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:13 PM
జిల్లాకు వచ్చే పర్యాటకులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. జిల్లాలో పర్యాటకంపై వివిధ శాఖల అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం
పాడేరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు వచ్చే పర్యాటకులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. జిల్లాలో పర్యాటకంపై వివిధ శాఖల అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా జిల్లాకు వచ్చే పర్యాటకులకు జాతీయ రహదారి కూడళ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎకరం వరకు స్థలాన్ని సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఎంపిక చేసిన స్థలంలో పర్యాటకులకు వాష్‌రూమ్‌లతో పాటు అక్కడ గిరిజన ఉత్పత్తుల స్టాళ్లు, ఇతర దుకాణాలను ఏర్పాటు చేస్తే పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అలాగే స్థానికులకు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. హోమ్ స్టే టూరిజంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రయోగాత్మకంగా ఒక ఇంటిని మోడల్ హోమ్ స్టేకు నమూనాగా తయారు చేయాలన్నారు. హోమ్ స్టే టూరిజానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో కార్వాన్ టూరిజం అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలి
జిల్లాలోని పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. సందర్శనీయ ప్రాంతాల్లో పర్యావరణాన్ని దెబ్బతీయకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను అనుమతించవద్దన్నారు. పర్యాటకులు సైతం పర్యావరణ హితంగా ఉండాలని, పచ్చదనాన్ని పాడుచేయవద్దని కలెక్టర్ సూచించారు. చెక్‌పోస్టుల వద్ద ప్లాస్టిక్‌పై తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు శ్రీపూజ, స్మరణ్‌రాజ్, అపూర్వభరత్, డివిజనల్ అటవీ అధికారి పీవీ.సందీప్‌రెడ్డి, జిల్లా టూరిజం అధికారి జి.దాసు, జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్, గ్రామ సచివాలయాల నోడల్ అధికారి పీఎస్ కుమార్, సీపీవో ప్రసాద్ పాల్గొన్నారు.