సదుపాయాలు కనుమరుగు
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:15 PM
ఆంధ్ర కశ్మీర్ లంబసింగితో పాటు పరిసర పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడా మరుగుదొడ్లు అందుబాటులో లేవు. దీంతో పర్యాటకులు మల, మూత్ర విసర్జనకు అవస్థలు పడుతున్నారు.
లంబసింగిలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు
పర్యాటకులకు తప్పని అవస్థలు
టాయిలెట్ల ఏర్పాటు ప్రకటనలకే పరిమితం
నెల రోజుల్లో ప్రారంభంకానున్న పర్యాటక సీజన్
చింతపల్లి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీర్ లంబసింగితో పాటు పరిసర పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడా మరుగుదొడ్లు అందుబాటులో లేవు. దీంతో పర్యాటకులు మల, మూత్ర విసర్జనకు అవస్థలు పడుతున్నారు. కొంత మంది పర్యాటకులు కాఫీ తోటల్లోకి వెళ్లి మూత్ర విసర్జన చేస్తున్నారు. ఏటా పర్యాటక సీజన్ ప్రారంభానికి ముందు లంబసింగిలో రక్షిత తాగునీరు, బయో టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని అధికారులు, పాలకులు ప్రకటించడం, ఆ తరువాత అది కార్యరూపం దాల్చకపోవడం సర్వసాధారణమైపోయింది.
లంబసింగికి నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు పర్యాటకులు అత్యధిక సంఖ్యలో వస్తుంటారు. శని, ఆదివారాలు వేల సంఖ్యలో సందర్శిస్తుంటారు. దీంతో పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా ఉంటాయి. ప్రధానంగా లంబసింగి జంక్షన్, లంబసింగి, రాజుపాకలు, భీమనాపల్లి, తాజంగి జలాశయం, చెరువులవేనం వద్ద పర్యాటకుల సంఖ్య అధికంగా ఉంటోంది. ఓ వైపు మంచు అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే సందర్శక ప్రాంతాలైన లంబసింగి జంక్షన్, లంబసింగి, భీమనాపల్లి, భీమనాపల్లి, తాజంగి జలాశయం ప్రాంతాల్లో ఎక్కడా మరుగుదొడ్లు లేవు. చెరువులవేనం వ్యూపాయింట్‌లో ఆరు మరుగుదొడ్లు ఉన్నా వాటి నిర్వహణ సక్రమంగా లేదు. దీంతో పర్యాటకులు మల, మూత్ర విసర్జనకు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న లంబసింగి, తాజంగిలలో సందర్శకులకు కనీస సదుపాయాల కల్పనలో ఐటీడీఏ, పర్యాటక శాఖలు పూర్తిగా విఫలమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. లంబసింగిలో బయో టాయిలెట్స్, ప్రజా మరుగుదొడ్లు నిర్మిస్తామని ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం ప్రకటనలు జారీ చేయడం, ఆ తరువాత మిన్నకుండిపోతోంది. కూటమి ప్రభుత్వమైనా లంబసింగిలో కనీస వసతులు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు.
అత్యవసర సమయంలో అవస్థలే..
లంబసింగి సందర్శించే పర్యాటకులు మల విసర్జనకు సైతం సిగ్గు విడిచి తుప్పల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రధానంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారు. లంబసింగి రిసార్ట్స్‌లో బసచేసిన పర్యాటకులు అద్దెకు తీసుకున్న గదుల్లోనే కాలకృత్యాలు తీర్చుకుంటారు. మైదాన ప్రాంతాల నుంచి ఉదయం వేళలో లంబసింగి వచ్చే పర్యాటకులకు వసతి లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. లంబసింగిలో పర్యాటకులకు పూర్తి స్థాయిలో సరిపడే వసతి సదుపాయం లేదు. దీంతో మైదాన ప్రాంతాల్లో బస చేసి ఉదయం ఐదు గంటలకు పర్యాటకులు లంబసింగి చేరుకుంటున్నారు. సాయంత్రం వరకు లంబసింగిలో ఉంటున్నారు. దీంతో అధిక సమయం మల, మూత్ర విసర్జనకు వెళ్లకుండగా ఉండడం కష్టంగా ఉంది. పురుషులు తుప్పల్లోకి వెళ్లి అవసరాలు తీర్చుకుంటున్నా, మహిళల కష్టాలు వర్ణనాతీతం.
ప్రకటనలకే పరిమితం..
లంబసింగి-తాజంగి, చెరువులవేనంకి వెళ్లే మార్గాల్లో పలు చోట్ల పర్యాటకుల సౌకర్యార్థం బయో టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని అధికారులు సీజన్ ప్రారంభానికి ముందు నుంచి చెబుతున్నారు. ఎక్కడా ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ప్రజా మరుగుదొడ్లు సదుపాయం కల్పిస్తామన్నారు. మరో నెల రోజుల్లో పర్యాటక సీజన్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, పర్యాటకశాఖ స్పందించి లంబసింగి జంక్షన్, లంబసింగి, భీమనాపల్లి, తాజంగి జలాశయం, రాజుపాకలు, చెరువులవేనం ప్రాంతాల్లో మరుగుదొడ్లు, బయోటాయిలెట్స్ ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని పర్యాటకులు అంటున్నారు.