Share News

డిగ్రీ కాలేజీల్లో ముఖ ఆధారిత హాజరు

ABN , Publish Date - Aug 24 , 2025 | 01:30 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని కొన్ని డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్‌ చెప్పేందుకు అధికారులు నడుంబిగించారు.

డిగ్రీ కాలేజీల్లో ముఖ ఆధారిత హాజరు

ఏయూ నిర్ణయం

అక్రమాలకు చెక్‌ చెప్పేందుకే...

తరగతులకు హాజరు కాని విద్యార్థులు నుంచి ఫీజు పేరిట డబ్బులు వసూలుచేసి

పరీక్షలకు అనుమతిస్తున్న కొన్ని కళాశాలల యాజమాన్యాలు

అదో వ్యాపారంగా మారినట్టు అధికారుల గుర్తింపు

అందుకే ఈ నెల 30కల్లా బయోమెట్రిక్‌ మెషీన్లు

ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు

వర్సిటీ నుంచే పర్యవేక్షణ

విశాఖపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని కొన్ని డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్‌ చెప్పేందుకు అధికారులు నడుంబిగించారు. అనేక కాలేజీల్లో విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోయినా వారి నుంచి భారీమొత్తంలో అదనపు ఫీజులు వసూలు చేస్తూ పరీక్షలకు అనుమతిస్తున్నారు. ఈ విషయం వర్సిటీ అధికారుల దృష్టికి వచ్చింది. అందుకే డిగ్రీ కాలేజీల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్‌ మెషీన్లు ఏర్పాటు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీచేశారు. బయోమెట్రిక్‌ మెషీన్ల ద్వారా ముఖ ఆధారిత హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్‌) వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నదీ.?, లేనిదీ?...వర్సిటీ నుంచే అధికారులు పర్యవేక్షించనున్నారు. ఇది విద్యార్థులకు, అదేవిధంగా అధిక మొత్తంలో ఫీజులు వసూలుచేసే కాలేజీ యాజమాన్యాలకు చెక్‌ చెప్పేందుకు ఉపకరిస్తుందని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.

అక్రమాలకు చెక్‌..

ఏయూ పరిధిలో 190 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వాటి పరిధిలో ఏటా సుమారు 30 నుంచి 35 వేల మంది చేరుతుంటారు. ఇతర వ్యాపకాలతో ఎంతోమంది తరగతులకు ఎగనామం పెడుతుంటారు. అటువంటి విద్యార్థుల నుంచి కాలేజీ యాజమాన్యాలు మూడు వేల నుంచి రూ.7 వేల వరకు వసూలుచేసి పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కాలేజీ యాజమాన్యాలకు ఇదో వ్యాపారంగా మారింది. కొన్ని కాలేజీలు అయితే ప్రత్యేకంగా విద్యార్థులతో ముందే ఈ తరహా లావాదేవీలను మాట్లాడుకుంటున్నాయి. కాలేజీలకు రాకపోయినా హాజరు ఉండేటట్టు చూస్తామని, అందుకు కొంత చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నాయి. దీంతో అటువంటి కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని గుర్తించిన ఏయూ అధికారులు బయోమెట్రిక్‌ హాజరును తీసుకువచ్చారు.

ఇదేకాకుండా ఏయూ అఫ్లియేషన్‌ లేకపోయినా కొన్ని కాలేజీల్లో అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఆ తరువాత సదరు విద్యార్థులను అఫ్లియేషన్‌ ఉన్న మరో కాలేజీలకు పంపుతున్నారు. ఈ తరహా అక్రమాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. అటువంటి వాటికి కూడా ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానంతో బ్రేక్‌ పడుతుందని ఏయూ అధికారులు చెబుతున్నారు.

తప్పనిసరిగా అమలు చేయాలి..

బయోమెట్రిక్‌ మెషీన్లు ఏర్పాటు చేయాలంటూ ఏయూ అధికారులు ఈ నెల 22న అనుబంధ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాల్స్‌, సెక్రటరీలు, కరస్పాండెంట్లకు సర్క్యులర్‌ విడుదల చేశారు. ఈ నెల 30లోగా మెషీన్లు ఇన్‌స్టాల్‌ చేయాలని స్పష్టంచేశారు. మెషీన్లు ఏర్పాటు చేయడంతోపాటు వాటిని యూనివర్సిటీ నుంచి మానటరింగ్‌ చేసేందుకు అనుగుణమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సర్క్యులర్‌ను అత్యవసరంగా భావించాలని సీడీసీ డీన్‌ పేరుతో వెలువడిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 01:30 AM