తగ్గని చలి తీవ్రత
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:14 PM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతుండడంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది.
దిగజారుతున్న ఉష్ణోగ్రతలు
జి.మాడుగులలో 7.5 డిగ్రీలు
పాడేరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతుండడంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం వాతావరణంలో మార్పుల కారణంగా కొన్ని రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతూ సింగిల్ డిజిట్‌లో కొనసాగుతున్నాయి. అలాగే ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతోనూ చలి తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఆదివారం జి.మాడుగులలో 7.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగత నమోదుకాగా, ముంచంగిపుట్టులో 8.1, పాడేరులో 9.2, చింతపల్లి, పెదబయలులో 9.6, హుకుంపేటలో 10.0, అరకులోయలో 10.4, కొయ్యూరులో 13.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వణుకుతున్న ఏజెన్సీ వాసులు
మన్యంలో గత కొన్ని రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా దిగజారుతుండడంతో ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు. తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతోపాటు ఎండ సైతం పెద్దగా కాయకపోవడంతో శీతల వాతావరణం కొనసాగుతున్నది. రాత్రి, పగలు తేడా లేకుండా చలి ప్రభావం చూపుతున్నది. దీంతో ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు.
హుకుంపేటలో...
హుకుంపేట: మండలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదివారం ఉదయం 10 గంటల వరకు హుకుంపేటలో పొగమంచు వీడలేదు. ప్రధాన రహదారిపై దట్టంగా మంచు కురవడంతో వాహనాలు హెడ్ లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాయి.