తగ్గని చలి తీవ్రత
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:20 PM
మన్యంలో ఆదివారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. శీతాకాల వాతావరణం నెలకొనడంతో పొగమంచు దట్టంగానే కురిసింది.
ముంచంగిపుట్టులో 5.9 డిగ్రీలు
వణుకుతున్న జనం
పాడేరు, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఆదివారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. శీతాకాల వాతావరణం నెలకొనడంతో పొగమంచు దట్టంగానే కురిసింది. దీంతో పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. తాజా వాతావరణం పర్యాటకులకు కనువిందు చేసేలా ఆహ్లాదకరంగా ఉంది. అలాగే అరకులోయ, వంజంగి, తాజంగి సందర్శనకు వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కొనసాగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ముంచంగిపుట్టులో ఆదివారం 5.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, జి.మాడుగులలో 7.6, పెదబయలులో 8.3, అరకులోయలో 8.8, పాడేరులో 9.2, చింతపల్లిలో 9.6, హుకుంపేటలో 9.9, కొయ్యూరులో 12.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
డుంబ్రిగుడలో..
డుంబ్రిగుడ: మండలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఆదివారం ఉదయం 9 గంటల వరకు పొగమంచు వీడలేదు. దీంతో వాహనదారులు హెడ్ లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించారు. వీధుల్లో ఎక్కడ చూసినా చలి మంటలు కాగుతున్న జనం కనిపించారు.