Share News

ఎలమంచిలి రాని ఎక్స్‌ప్రెస్‌ బస్సులు

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:41 AM

అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన ఎలమంచిలిలోని ఆర్టీసీ బస్‌స్డాండ్‌కు ఎక్స్‌ప్రెస్‌ బస్సులు పూర్తిస్థాయిలో రాకపోకవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొక్కిరాపల్లి రైల్వే గేటు స్థానంలో ఫ్లై ఓవర్‌ వంతెన అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా దూరప్రాంత సర్వీసులను ఎలమంచిలి మీదుగా నడపకపోవడం శోచనీయమని స్థానికులు అంటున్నారు.

ఎలమంచిలి రాని ఎక్స్‌ప్రెస్‌ బస్సులు
ఎలమంచిలి ఆర్టీసీ బస్‌ స్డాండ్‌

దూరప్రాంతాల ప్రయాణానికి ఇక్కట్లు

రైల్వే ఫ్లై ఓవర్‌ వంతెన అందుబాటులోకి వచ్చినా.. పూర్తిస్థాయిలో బస్సులు నడపని అధికారులు

ఎలమంచిలి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన ఎలమంచిలిలోని ఆర్టీసీ బస్‌స్డాండ్‌కు ఎక్స్‌ప్రెస్‌ బస్సులు పూర్తిస్థాయిలో రాకపోకవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొక్కిరాపల్లి రైల్వే గేటు స్థానంలో ఫ్లై ఓవర్‌ వంతెన అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా దూరప్రాంత సర్వీసులను ఎలమంచిలి మీదుగా నడపకపోవడం శోచనీయమని స్థానికులు అంటున్నారు.

ఎలమంచిలి బస్టాండ్‌ నుంచి మునిసిపాలిటీతోపాటు చుట్టుపక్కల వున్న ఎలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజల దూర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. సుమారు పదేళ్ల క్రితం వరకు హైదరాబాద్‌, విజయవాడ, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, టెక్కలి, శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు ఎలమంచిలి బస్‌స్డాండ్‌ మీదుగా రోజూ 30కి పైగా ఎక్స్‌ప్రెస్‌ బస్సులు నడిచేవి. దీంతో బస్‌స్టాండ్‌ ప్రయాణికులతో రద్దీగా వుండేది. అయితే కొక్కిరాపల్లి వద్ద రైల్వే గేటు స్థానంలో ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించడంతో ఆర్టీసీ అధికారులు ఎక్స్‌ప్రెస్‌ బస్సు సర్వీసులను హైవే మీదుగా మళ్లించారు. ఎలమంచిలి నుంచి ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో అనుకున్నమేర ప్రయాణికులు ఎక్కడం/ దిగడం లేదని, అంతేకాక రైలు గేటు పడినప్పుడు బస్సులు ఎక్కువ సేపు ఆగాల్సి రావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, ఈ కారణాల వల్ల ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను హైవే మీదుగా మళ్లించాల్సి వచ్చిందని అప్పట్లో అధికారులు చెప్పుకొచ్చారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఎలమంచిలి ప్రయాణికులు.. అటు అడ్డరోడ్డు లేదా ఇటు అనకాపల్లి వెళ్లి, వేరే బస్సులు ఎక్కాల్సి వస్తున్నది. కాగా కొక్కిరాపల్లి వద్ద రైల్వే ఫ్లై ఓవర్‌ వంతెన నిర్మాణం గత ఏడాది పూర్తయ్యింది. కానీ ఎక్స్‌ప్రెస్‌ బస్సులు పూర్తిస్థాయిలో ఎలమంచిలి మీదుగా రాకపోకలు సాగించేలా అధికారులు ఇంతవరకు ఏర్పాట్లు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌, ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడడంతో కొన్ని ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఎలమంచిలి మీదుగా మళ్లించారు. కానీ మరికొన్ని బస్సులను కూడా ఎలమంచిలి మీదుగా నడపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jun 27 , 2025 | 12:41 AM