Share News

నూతన వరి వంగడాల ప్రయోగాత్మక సాగు

ABN , Publish Date - Jul 31 , 2025 | 11:48 PM

ఆదివాసీ రైతులకు నాణ్యమైన వరి వంగడాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆచార్య ఎన్‌జీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు గిరిజన ప్రాంతంలో నూతన వరి రకాలపై ప్రయోగాత్మక సాగును ప్రారంభించారు. నాణ్యమైన వంగడాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించి విడుదల చేసిన ఆరు రకాల విత్తనాలను పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అభ్యుదయ రైతులకు అందజేశారు.

నూతన వరి వంగడాల ప్రయోగాత్మక సాగు
రైతులకు నూతన వరి వంగడాల మినీ కిట్లను అందజేస్తున్న శాస్త్రవేత్తలు

ఖరీఫ్‌లో అభ్యుదయ రైతులతో నాట్లు

ఆరు రకాలపై అధ్యయనం

దిగుబడి, నాణ్యత ఆధారంగా సాగు విస్తీర్ణం పెంపునకు శాస్త్రవేత్తల చర్యలు

చింతపల్లి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ రైతులకు నాణ్యమైన వరి వంగడాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆచార్య ఎన్‌జీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు గిరిజన ప్రాంతంలో నూతన వరి రకాలపై ప్రయోగాత్మక సాగును ప్రారంభించారు. నాణ్యమైన వంగడాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించి విడుదల చేసిన ఆరు రకాల విత్తనాలను పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అభ్యుదయ రైతులకు అందజేశారు. ఖరీఫ్‌ సాగులో ఈ ఆరు రకాలను రైతులతో నాట్లు వేయించారు. దిగుబడులు, నాణ్యత ఆధారంగా గిరిజన ప్రాంతంలో నూతన వంగడాల సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గిరిజన ప్రాంతంలో అత్యధిక విస్తీర్ణంలో ఆదివాసీ రైతులు వరి సాగు చేపడుతున్నారు. జిల్లాలో 55 వేల హెక్టార్లతో రైతులు వరి సాగు చేపడుతున్నారు. పదేళ్ల క్రితం వరకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన వరి వంగడాలను రైతులు నాటుకునేవారు. కొంత కాలంగా ఆదివాసీ రైతులు ఐబ్రీడ్‌ రకాలకు ఆకర్షితులయ్యారు. ఒడిశా ప్రాంతాలకు చెందిన ఐబ్రీడ్‌ రకాలను అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు. ఐబ్రీడ్‌ విత్తనాల వల్ల రైతులకు సాగు ఖర్చు పెరుగుతోంది. విత్తనాన్ని ప్రతి ఏటా అధిక ధర వెచ్చించి కొనుగోలు చేయాలి. పండించిన పంటను విత్తనాలుగా వినియోగించుకునే పరిస్థితి ఉండదు. ఐబ్రీడ్‌ రకాల వరి ఉత్పత్తులకు మార్కెట్‌లో అధిక ధర లభించడం లేదు. మెజారిటీ రైతులు ఆహారంతో కోసం ఐబ్రీడ్‌ రకాలను సాగు చేసుకుంటున్నారు. ఈ రకాలు ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కాదు. దీంతో ఆదివాసీ రైతులకు నాణ్యమైన వరి వంగడాలను పరిచయం చేయాలనే లక్ష్యంతో నూతన వంగడాలను దిగుమతి చేసుకుని శాస్త్రవేత్తలు ఈ ఏడాది రైతులకు పంపిణీ చేశారు. రైతులు ఈ ఖరీఫ్‌లో అరకు, పాడేరు, చింతపల్లి డివిజన్ల పరిధిలో అభ్యుదయ రైతులు తక్కువ విస్తీర్ణంలో నూతన వంగడాలు సాగు చేపడుతున్నారు.

ఆరు రకాలపై ప్రయోగాత్మక సాగు

గిరిజన ప్రాంతంలో ఆరు రకాలపై శాస్త్రవేత్తలు ఈ ఖరీఫ్‌లో శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక సాగు చేపడుతున్నారు. పలు పరిశోధన కేంద్రాల్లో అధ్యయనం చేసి నాణ్యమైన వంగడాలుగా శాస్త్రవేత్తలు గుర్తించి విడుదల చేసిన ఎంటీయూ 1426, ఎన్‌ఎల్‌ఆర్‌ 3648, ఆర్‌జీఎల్‌ 7034, ఆర్‌జీఎల్‌ 7039, ఆర్‌జీఎల్‌ 7030తో పాటు ఎన్‌డీఎల్‌ఆర్‌-7 రకాల మినీ కిట్లను రైతులకు అందజేశారు. ఎంపిక చేసిన రైతులకు మూడు కిలోలు చొప్పున నూతన వంగడాల విత్తనాలు అందజేశారు. పాడేరు ఏరువాక కేంద్రం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారుల సహకారంతో రైతులు పంట పొలాల్లో నాట్లు వేయించారు.

నాణ్యత, దిగుబడులపై అధ్యయనం

అభ్యుదయ రైతులకు అందజేసిన నూతన వంగడాలు నాట్లు వేసిన నాటి నుంచి పంట చేతికందే వరకు శాస్త్రవేత్తల పర్యవేక్షణ ఉంటుంది. రైతులు నారు వేయడం, నాట్లు వేయడం, కలుపు, సేంద్రీయ పద్ధతిలో ఎరువులు, క్రిమిసంహారక మందుల యాజమాన్యంపై సలహాలు, సూచనలు ఇస్తారు. ప్రధానంగా గిరిజన ప్రాంత వాతావరణం, నేలలకు నూతన వంగడాలు ఏ విధంగా అనుకూలిస్తున్నాయని శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు. ఈ వంగడాల పంటలకు తెగుళ్లు ఆశిస్తున్నాయా?, తెగుళ్లను ఏ స్థాయిలో తట్టుకుంటుంది?, దిగుబడులు, నాణ్యత ఏవిధంగా ఉందనే అంశాలను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.

Updated Date - Jul 31 , 2025 | 11:48 PM