విస్తరణం
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:41 AM
అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనులకు నిర్వాసితుల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. నష్టపరిహారాన్ని వీఎంఆర్‌డీఏ ద్వారా టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) బాండ్ల రూపంలో ఇస్తామని అధికారులు చెబుతుండగా.. నిర్వాసితులు ససేమిరా అంటున్నారు. టీడీఆర్‌లు వద్దని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి విస్తరణపై వివాదం
టీడీఆర్ బాండ్లు వద్దు, నష్టపరిహారమే కావాలని నిర్వాసితుల డిమాండ్
గ్రామ సభల్లో అధికారులకు విస్పష్టం
2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని వినతి
పార్టీలకు అతీతంగా అఖిలపక్షం ఏర్పాటు
ఇటీవల మంత్రి లోకేశ్‌కు వినతిపత్రం
ప్రజాభిప్రాయం మేరకే రోడ్డు విస్తరణ పనులు చేపడతామని హామీ
ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొస్తున్న నిర్వాసితులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనులకు నిర్వాసితుల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. నష్టపరిహారాన్ని వీఎంఆర్‌డీఏ ద్వారా టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) బాండ్ల రూపంలో ఇస్తామని అధికారులు చెబుతుండగా.. నిర్వాసితులు ససేమిరా అంటున్నారు. టీడీఆర్‌లు వద్దని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు గ్రామాల వారీగా నిర్వాసితులతో సమావేశాలు ఏర్పాటు చేసి, టీడీఆర్ బాండ్లు తీసుకుని, రహదారి విస్తరణకు సహకరించాలని కోరుతున్నారు. కానీ నిర్వాసితులు ఇందుకు ఒప్పుకోవడంలేదు.
అనకాపల్లి నుంచి మనగపాక మీదుగా అచ్యుతాపురం వరకు 13.75 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్డు వుంది. ప్రస్తుతం దీని వెడల్పు 30-35 అడుగులు వుంది. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుతో ఎన్ని పరిశ్రమలు, కంపెనీలు వచ్చాయి. మరెన్నో నిర్మాణంలో వున్నాయి. రాంబిల్లి మండలంలో ప్రత్యామ్నాయ నేవల్ ఆపరేషనల్ బేస్ ఏర్పాటవుతున్నది. ఇంకా అచ్యుతాపురం మండలంలో సుమారు రెండు వేల ఎకరాల్లో ‘బార్క్’ నిర్మాణంలో వుంది. దీంతో అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డులో వాహనాల రద్దీ ఎన్నో రెట్లు పెరిగింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇది సింగిల్ లేన్ రోడ్డు కావడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సి వస్తున్నది. భారీ వాహనాల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం చేరుకోవడానికి రద్దీ సమయాల్లో సుమారు గంట సేపు పడుతున్నది. ఈ నేపథ్యంలో రహదారిని విస్తరించాలని పదేళ్ల నుంచి ప్రజలు కోరుతున్నారు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వ హయాంలో కదలిక వచ్చింది.
వంద అడుగులకు విస్తరణ
ప్రస్తుతం సింగిల్ లేన్‌గా వున్న ఈ రహదారిని రూ.243 కోట్లతో డబుల్ లేన్‌గా అభివృద్ధి చేయడానికి (సుమారు వంద అడుగుల వెడల్పు) ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విస్తరణలో భాగంగా అచ్యుతాపురం జంక్షన్‌లో ఫ్లైఓవర్ వంతెన, మధ్యలో రెండుచోట్ల మైనర్ వంతెనలు, 47 కల్వర్టులు నిర్మించనున్నారు. రెండేళ్లలో పనులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారుల లెక్కల ప్రకారం రహదారి విస్తరణ కారణంగా అనకాపల్లి, మునగపాక, అచ్యుతాపురం మండలాల్లో స్థలాలు, ఇళ్లు, భూములు కోల్పోయే వారు సుమారు 1,200 మంది వుంటారు. ఇటీవల టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. మంతి నారా లోకేశ్ అచ్యుతాపురం జంక్షన్‌లో రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేశారు.
టీడీఆర్ బాండ్లను వద్దంటున్న నిర్వాసితులు
రోడ్డు విస్తరణ కారణంగా స్థలాలు, ఇళ్లు, దుకాణాలు, పొలాలు కోల్పోయే వారికి ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తుంటుంది. అయితే నిధుల కొరత కారణంగా వీఎంఆర్‌డీఏ ద్వారా టీడీఆర్ బాండ్లు ఇస్తామని అధికారులు అంటున్నారు. టీడీఆర్ బాండ్ల విలువ, వాటిని వినియోగించుకునే విధానం గురించి రెవెన్యూ అధికారులు కొద్ది రోజుల నుంచి గ్రామాల వారీగా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే టీడీఆర్ బాండ్లు తీసుకోవడానికి నిర్వాసితులు ససేమిరా అంటున్నారు. భూ సేకరణ చట్టం ప్రకారం తమకు నష్టపరిహారాన్ని చెక్కుల రూపంలో అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువకు నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు పరిహారంగా ఇవ్వాల్సి వుంటుందని వారు చెబుతున్నారు. రోడ్డు విస్తరణ జరుగుతున్న పది గ్రామాల్లో భూములు, ఇళ్లు కోల్పోనున్న వారు ఇటీవల పార్టీలకు అతీతంగా అఖిలపక్షంగా ఏర్పడ్డారు. ప్రతి గ్రామం నుంచి ఇద్దరు చొప్పున పోరాట కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఇటీవల రోడ్డు విస్తరణకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి లోకేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించిన మంత్రి.. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజాభిప్రాయం మేరకే రోడ్డు విస్తరణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అధికారులు నిర్వహిస్తున్న సమావేశాల్లో.. నిర్వాసితులు ఈ విషయాన్ని ప్రస్తావించి, ప్రజాభిప్రాయం మేరకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. అయితే విజ్ఞాపనలను స్వీకరించి ప్రభుత్వానికి నివేదిస్తాని అధికారులు చెబుతున్నారు.